
పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ జి రాజకుమారి
మొంథా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డిలు అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యలతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్షించి అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎం. డీ. ఫరూక్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పంట నష్టం చోటుచేసుకుందని, నిష్పక్షపాతంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను ఖచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామని పేర్కొన్నారు. రైతులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వాగులు, వంకలు మరియు కుందూ నది పొంగి ప్రవహించిన నేపథ్యంలో ‘రివర్స్ స్ట్రాటజీ’ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నంద్యాల పట్టణాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడగలిగామని తెలిపారు. తుఫాన్ ప్రభావం కారణంగా మున్సిపాలిటీకి కూడా గణనీయమైన నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిత్యం పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి సమయానుకూల ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతో ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామని అన్నారు. తుఫాన్ సమయంలో వాగుల్లో పొంగిపొర్లుతున్న నీరు రోడ్లపై ప్రవహించడంతో కొంత కాలం పాటు రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రికి సమగ్రంగా నివేదిస్తామని తెలిపారు. తుఫాన్ సమయంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మరియు అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించి పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారని మంత్రి ఫరూక్ ప్రశంసించారు. ప్రజల భద్రత, పంట రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ దిశగా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వరద నీరు రివర్స్ దిశగా మళ్లించే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్న నీటిపారుదల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరు ఒక కేస్ స్టడీగా నిలిచిందని, దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నేడు మనమంతా ప్రశాంతంగా కూర్చున్నామంటే కారణం క్షేత్రస్థాయిలో అధికారులు సమష్టిగా పనిచేసి తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడమేనని అన్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టం అంచనా వేయాలని, అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని అంచనాలు వేయొద్దని స్పష్టం చేశారు. 48 గంటల పాటు పంట నీట మునిగితేనే నష్టపరిహారం అందజేస్తామన్న అధికారుల నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించి, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా రహదారుల మరమ్మత్తు పనులు తక్షణం చేపట్టాలని, ఆర్ & బీ శాఖ అధికారులు నష్టం అంచనా వేస్తే అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2 గంటలకైనా సచివాలయంలో ఉండి ప్రతి జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షించిన ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ సైతం తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. సమయం పడుతుందేమో కానీ ప్రతి బాధితునికి న్యాయం చేస్తామని ధైర్యంగా చెప్పారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. అధికారులు తొందరపాటుగా కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇంత పెద్ద విపత్తు సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన సందర్భంలో విమర్శలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు నాయుడే అని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి హోదాలో కూడా తన అనుభవంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయంతో ముందుండి నడిపించిన ఆయన ప్రతిభ వలనే రాష్ట్రం ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా బయటపడగలిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మరియు అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే ఈ విపత్తును సాఫీగా ఎదుర్కొనగలిగామని చెప్పారు. గతంలో బనగానపల్లెలో కుందూ నది ప్రవాహం వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లేదని, అయితే ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో పంట నష్టం తీవ్రత తగ్గిందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మొంథా తుఫాను ప్రభావం ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, నంద్యాల జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో నవంబర్ 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి విపత్తు సంభవించకుండా పూర్తి స్థాయిలో నిరోధక చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 30 మండలాలు ఉండగా, అందులో 27 మండలాలు వరద ప్రభావానికి గురై, సుమారు 244 గ్రామాలు వర్షాల వల్ల నష్టపోయినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, భోజనం, వసతి వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముఖ్యంగా నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు మండలాలు ఎక్కువ వర్షాలకు గురై, సుమారు 17,055 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. జిల్లాలో పంట పొలాలకు సంబంధించి 65 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసినట్లు తెలిపారు. అందులో 36,948 హెక్టార్ల పంటలు నష్టపోయాయి — వీటిలో 17 వేల హెక్టార్లు వరి, 17 వేల హెక్టార్లు మొక్కజొన్న, మిగతా 2 వేల హెక్టార్లు ఇతర పంటలు అని వివరించారు. పండ్ల తోటలకు సంబంధించి 744 హెక్టార్లు నష్టపోయాయని, ముఖ్యంగా మిరప, పపాయి, ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో సుమారు 27 వేల మట్టి మిద్దెలు ఉండగా, అధిక వర్షాల కారణంగా అక్కడ ఎవరూ ఉండకుండా రెవెన్యూ సిబ్బంది ద్వారా నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సుమారు 7 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, అందులో 897 ఇళ్లు (నంద్యాల-554, ఆత్మకూరు-193, డోన్-150) తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ. 1.20 లక్షలు, పక్కా ఇళ్లకు రూ. 6 వేల, కచ్చా ఇళ్లకు రూ. 4 వేల చొప్పున పరిహారం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖకు సంబంధించి 25 పడవలు, 34 చేప వలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 27 రోడ్లు (సుమారు 110 కిమీ), పంచాయతీ రాజ్ శాఖకు చెందిన 6 రోడ్లు (సుమారు 32.85 కిమీ) నష్టపోయాయని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 17 వరకు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో అధిక వర్షాల కారణంగా వ్యవసాయం, హార్టికల్చర్ మినహా మొత్తం నష్టం రూ. 1686.01 లక్షలుగా అంచనా వేయబడిందని వివరించారు.
