
పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకాశ మహాదీపోత్సవం,
కార్తీకమాసోత్సవం పురస్కరించుకుని ఈ నెల 5న కార్తీక పౌర్ణమి రోజున నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యం వెలిగే ఆకాశదీపం, భక్తులు వెలిగించే లక్ష దీపోత్సవం వెలుగులతో పాటు ఎర్రమల కొండల్లోని ఎగువన ఉన్న పశ్చిమ పర్వతసానువుల్లో ఆకాశ మహా దీపోత్సవంవెలుగుతో అలరారనుంది. ఉమామహేశ్వర స్వామి ప్రియభక్తుడు, క్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు తపించే పాణ్యం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి 2022లో ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది అరుణాచలంలో వెలిగే జ్యోతి ఉత్సవం తరహాలో కార్తీక పౌర్ణమి రోజున అఖండ జ్యోతి వెలిగేలా ఏర్పాట్లు చేశారు. 5 వ తేదీ పౌర్ణమి రోజున సాయంత్రం 5.30 గంటలకు ఎర్రమలగిరుల్లో ఆకాశదీపం దేదీప్యమానంగా వెలగనుంది. ఇందుకు సంబంధించి సోమవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాలరెడ్డి,ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరెమ్మలు మహాదీపోత్సవం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.వివరాల్లోకి వెళితే..దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ క్షేత్రంలో శివుడు లింగాకారంలో కాకుండా పార్వతిసమేతంగా విగ్రహరూపాన స్వయంభువుగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు.సాధారణ రోజుల్లోనే కాకుండా, ప్రతియేటా మాఘమాసంలో,కార్తీక మాసంలో, శివరాత్రి పండుగ పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి ఉమామహేశ్వరులను దర్శించుకుంటారు.కాలజ్ఞాన తత్వవేత్త శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో కలియుగాంతన యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి రంకె వేస్తాడాని ప్రవచించిన నంది విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. అలాగే నిత్యం జాలువారే నీటిబుగ్గ ప్రవాహంతో ఏర్పడిన చిన్నకొనేరు,పెద్ద కోనేరు భక్తులకు కనువిందు చేస్తుంటాయి. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలనుంచి శివానుగ్రహంతో పాటు సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయత వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూండటంతో ఈ క్షేత్రం నిత్యం సందడిగా ఉంటుంది. అయితే ఇంతటి ప్రాశస్త్యం ఉన్న యాగంటి క్షేత్రం మరింత ప్రసిద్ధి చెందేలా శ్రీ ఉమామహేశ్వర స్వామి ప్రియభక్తుడు, క్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు తపించే పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున అఖండ జ్యోతి వెలిగేలా ఏర్పాట్లు చేశారు.2022లో యాగంటి పర్వతసానువుల్లో…ఒక గిరిపై అరుణాచలంలో పౌర్ణమి రోజున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో అలాంటి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అఖండ జ్యోతిని వెలిగించేందుకు 1000 కేజీల ఆవు నెయ్యితో, 150 నుంచి 180 మీటర్ల దీపపువత్తి వెలిగేలా శాశ్వత స్తూపం ఏర్పాటు చేసారు. మొట్ట మొదటిసారిగా అదే ఏడాది అఖండ జ్యోతి వెలుగులు క్షేత్రం నలుదిశలా కనిపించాయి. వరుసగా నాలుగవ సంవత్సరం కాటసాని రామభూపాల రెడ్డి , శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ, దాతల సహకారంతో బుధవారం కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం 5.30 ని.లకు అఖండ మహాదీపోత్సవ జ్యోతి వెలిగించటానికి అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి యాగంటి క్షేత్రానికి విచ్చేసి భక్తులు అఖండ జ్యోతిని దర్శించుకుని ఆ పరమశివుని కృపకు పాత్రులు కావాలని కాటసాని రామభూపాల రెడ్డి కోరారు.
