
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- ఏప్రిల్ 14 వరకు యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ
- మండల కార్యాలయాల్లో ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు సహాయకుల ఏర్పాటు
- లాభదాయకమైన యూనిట్లు ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాలి
- రాజీవ్ యువ వికాసంపై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం
యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, రాజీవ్ యువ వికాసంపై అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ల క్రింద 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కొరకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఓబిఎంఎంఎస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఎంపిడిఓ, తహసిల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ను మంచి కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ తో ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు సహకారం అందించాలని అన్నారు. గ్రామాలలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్ లపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఆధార్, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల లోపు) మొదలైనవి అవసరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని, లబ్దిదారులకు అర్హత ఉంటే తహసిల్దార్ ఫాస్ట్ ట్రాక్ లో అవసరమైన సర్టిఫికెట్ జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్దిదారులకు అవసరమైన బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని అన్నారు. మనకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి ప్రాక్టికల్ గా నడిచే యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్దిదారులకు నడిచే యూనిట్లపై ప్రచారం కల్పించాలని అన్నారు. ప్రజావాణి తరువాత సమావేశం నిర్వహించి దరఖాస్తుల స్క్రూటిని, చేపట్టాల్సిన చర్యల పై చర్చించాలని అన్నారు. సెక్టార్ స్పెసిఫిక్ యూనిట్ లను సంబంధిత అధికారులు తప్పనిసరిగా సర్టిఫై చేయాలని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత రాజీవ్ యువ వికాసం క్రింద వచ్చిన దరఖాస్తులు, ప్రతి మండలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సరి చూసుకుని స్క్రూటినీ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయిలో ధృవీకరించిన దరఖాస్తులలో కొంత శాతం జిల్లా స్థాయి అధికారులు మరొకసారి పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. జూన్ నెల నాటికి యూనిట్ల గ్రౌండింగ్ కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం సంబంధిత లబ్ధిదారులు లేదా కుటుంబ సభ్యులు మాత్రమే దరఖాస్తు చేయాలని, ఇతరులు దరఖాస్తు చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో ఓపిక ఉన్న అధికారులను పెట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇంచార్జ్ ఇడి నవీన్ బాబు, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి ఎన్. విజయలక్ష్మీ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, బ్యాంక్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
