
పయనించే సూర్యడు సెప్టెంబర్ 12 సూర్యాపేట జిల్లా
నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు రైతులకు అవసరమైన యూరియా ఎరువును సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ తీవ్రంగా విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని, పది సంవత్సరాల పాలనలో ఎప్పుడూ యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.ప్రస్తుతం రైతులు, ముఖ్యంగా మహిళ రైతులు, తెల్లవారుజాము మూడు గంటల నుంచే సొసైటీల వద్ద క్యూలో నిలబడి, తిండి నీళ్లతో పాటు విశ్రాంతిని కూడా లేకుంట అవస్థలు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. సాగుకు తక్షణంగా అవసరమైన యూరియాను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పాలకుల అసమర్థతకు నిదర్శనమని ఉపేందర్ పేర్కొన్నారు.రైతుల కోసం తరచూ “రైతు బిడ్డలమని” చెప్పుకునే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు, మాటలకే పరిమితమయ్యారని, నిజమైన రైతు సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి, రైతులకు అవసరమైన యూరియాను అందించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.