
రంపచోడవరం రాజమండ్రి లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
పయనించే సూర్యుడు రిపోర్టర్ డివిజన్ ఇంచార్జి ఆగష్టు 22
పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు, పోలవరం ముంపు మండలాలు కలిపి తొలితరం స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరుతో ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని, రంపచోడవరాన్ని రాజమండ్రిలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి డిమాండ్ చేసింది. ఈరోజు ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాసు అధ్యక్షతన రంపచోడవరంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో షెడ్యూల్ ప్రాంత పరిపాలన సౌలభ్యం, వాటి ప్రత్యేక చట్టాలు అమలు కోసం ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కంగాల శ్రీనివాసు మాట్లాడుతూ సి.ఎం చంద్రబాబు నాయుడు గారు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చాలని కోరారు.
పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా జిల్లాల పునర్విభజనను ఆదివాసీ సమాజం స్వాగతిస్తుందని, అనేక తరాలుగా ప్రత్యేక పాలనకోసం అనేక పోరాటాల చేసిన చరిత్ర ఆదివాసీలదని గుర్తు చేసారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ వల్ల 5వ షెడ్యూల్డ్ ప్రాంత హక్కులకు తీవ్రమైన వికాసం కలుగుతుందని, ఇప్పటికే ఏజెన్సీలో బయట ప్రాంతాల వారి వలసలు పెరిగిపోవడం వలన ఆదివాసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని అన్నారు. ఆదివాసీలకు భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రతేక ఆదివాసీ హక్కులు, చట్టాలు అమలు చేయడం కష్టమవుతుందని దీనివల్ల ఆదివాసీలు అందరూ తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ ఆదివాసీ హక్కులు, చట్టాలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉండడం వల్ల 5వ షెడ్యూల్డ్ లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంతో ప్రత్యేక ఆదివాసీ జిల్లా చేయడమే సరైన పరిష్కారం అని,తూర్పు ఏజెన్సీ రంపచోడవరానికి ఎంతో ఘన చరిత్ర ఉందని,ఎంతో మంది ఆదివాసీ పోరాట వీరులు నడయాడిన భూభాగమని,అటువంటి ఘన చరిత్ర కల్గిన రంపచోడవరాన్ని విస్మరించడం తగదని, రంప పితూరు చరిత్రకు ఆద్యుడు మొదటి ఆదివాసీ పోరాట యోధుడు కారం తమ్మన్న దొర పేరిట ఆదివాసీలకు మరో ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేసి ఆదివాసీ హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నేతలు మట్ల కృష్ణారెడ్డి, తెల్లం శేఖర్, పొడియం పండుదొర, పల్లాల రాజకుమార్ రెడ్డి,మడకం ప్రసాద్ దొర, చవలం శుభ కృష్ణ,పండ పవన్ కుమార్ దొర, పోడియం శ్రీను బాబు,కర్రి సన్యాసి రెడ్డి,కత్తుల రమణ రెడ్డి,కారం రామన్నదొర మొదలగు వారు పాల్గొన్నారు.