
ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫామ్ పౌండ్ కచ్చితంగా ఏర్పాటు చేయాలి..
ప్రతినెల మొదటి మరియు మూడవ శుక్రవారం డ్రైడే నిర్వహించాలి..
నెలాఖరుకల్లా ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేయాలి..
ప్రతి మండలానికి ఒక ఇటుక తయారీ యూనిట్…
పెండింగ్ రేషన్ కార్డులు దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలి…
త్రాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించాలి…
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు మే ఒకటి (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా వ్యాప్తంగా పురోగతిలో ఉన్న పలు కార్యక్రమాలు మరియు మే కార్యాచరణ పై జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా అధికారులు,తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఏపిఎంలు, పంచాయతీ సెక్రటరీ లు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాల అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడి సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రులు, రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో బోరు ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతుల జాబితాను తయారు చేయాలన్నారు. తద్వారా బోరు ద్వారా వ్యవసాయం చేసే ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పౌండ్ నిర్మాణం కచ్చితంగా ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఫామ్ పౌండ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల అభివృద్ధితోపాటు చేపల పెంపకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. నిర్మించిన ప్రతి ఇంకుడు గుంతలు మరియు ఫామ్ పౌండ్ వివరాలను జల్ సెం చెయ్ జెన్ భాగీ దారి పథకంలో భాగంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ అధికారులు గ్రామాల్లో పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రతినెల మొదటి మరియు మూడవ శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు. వ్యర్థ నిర్వహణలో భాగంగా జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్లు ఇల్లందు, చుంచుపల్లి, అశ్వరావుపేట మరియు మణుగూరులో స్థాపనకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా లో తలెత్తే సమస్యలను త్వరితగతను పూర్తి చేయాలని, త్రాగునీటి సరఫరా ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సరఫరా చేపట్టాలని ఆదేశించారు.2025-26 ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పడుతున్న ఫామ్ పౌండ్స్, రోడ్డు ఫార్మేషన్, ట్రంచ్ వర్కులు పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ భూముల్లో ఫామ్ పౌండ్స్ ఉచితంగా ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్నామని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మీ చివరి నాటికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందరికీ ఏకరూప దుస్తులకు తయారీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2025-26 వన మహోత్సవంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వనమాత్సవాంలో భాగంగా చింత, రాగి, సుబాబులు, వెలగా, సిస్సు మరియు ఔషధ మొక్కలైన ఇప్ప, కరక్కాయ, తులసి, మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో సీడ్ బ్యాంకు ఏర్పాటుచేసి విద్యార్థులు విత్తనాలు సేకరించే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆయా కార్పొరేషన్లలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. పరిశీలించిన పూర్తి చేసి అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎన్నికల దరఖాస్తులు ఫామ్ 6,7 మరియు 8 లను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పేదలలో బహు పేద లకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాలో పేరు రానటువంటి పేదవారు ఉన్నట్లయితే వారిని కూడా జాబితాలో పొందుపరచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి,సిపిఓ సంజీవరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అనసూయ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, భూగర్భ జల అభివృద్ధి శాఖ ఎ డి రమేష్, మిషన్ భగీరథ ఈ ఈ లు తిరుమలేష్, నళిని మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.