
*అధికార దుర్వినియోగానికి,అవినీతికి పాల్పడిన రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోండి AILAJ డిమాండ్: పయనించే సూర్యుడు న్యూస్. మార్చి 30. గొలుగొండ మండల ప్రతినిధి N.చిరంజీవిగొలుగొండ మండలం, పాత మల్లంపేట మరియు గదబపాలెం గ్రామాలను ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్(AILAJ) బృందం శనివారం పర్యటించింది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది బి.శివ మాట్లాడుతూఫిబ్రవరి 24వ తేదీన గొలుగొండ మండల తహసిల్దార్ సర్వే నంబర్ 850-1 లో సుమారుగా 5 నుండి 5 కోట్ల రూపాయల విలువైన భూమిని NRI దుగ్గిరాల బాలకృష్ణ పేరుతో మార్పులు చేశారని, ఈమార్పులు చట్ట విరుద్ధమని మా పరిశీలనలో తేలిందన్నారు. ఈరోజు మేము క్షేత్ర స్థాయి పరిశీలన అందులో ఆదివాసీల సాగు అనుభవం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఆదివాసీల సాగు అనుభవంలో ఉన్నప్పటికీ దుగ్గిరాల బాలకృష్ణ ఈ భూమిని సాగు చేస్తున్నట్టుగా గ్రామ పరిపాలన అధికారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో దొంగ రిపోర్టులు తయారు చేయించి ప్రస్తుత తాహసిల్దార్ మార్పులు చేశారని, ఈ మార్పులు చట్టపరంగా చెల్లవన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సమాచారం గానీ నోటీసు గానీ ఇవ్వకుండా, సాగు అనుభవంలో ఉన్నవారికి తమ వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా రికార్డుల మార్పు చేయడం సహజ న్యాయ సూత్రాలకు గతంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని, దుగ్గిరాల బాలకృష్ణ సంతకం చేసిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) ను పరిశీలించామని, అందులో నాలుగు సంతకాలు ఉన్నాయని, వారందరికీ అమెరికా దేశపు పాస్ పోర్ట్ మరియు చిరునామాలు ఉన్నాయన్నారు. అమెరికాలో ఉంటున్న వారు పాత మల్లంపేటలో వ్యవసాయం ఎలా చేస్తున్నారో తాహసిల్దార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.2023 వ సంవత్సరం జనవరి నెలలో నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్కు రాసిన రిపోర్ట్ ను పరిశీలించామని అందులో GPA హోల్డ్ ర్ వక్కలంక సుధాకర్ గాని,అతని కుటుంబ సభ్యులు గాని సాగులో లేరని, ఆదివాసీలే సాగులో ఉన్నారని అంగీకరించారన్నారు. 2022వ సంవత్సరంలో వక్కలంక సుధాకర్ సాగులో లేకపోతే అతనికి GPA రాసి ఇచ్చిన వారిలో ఒకరైన దుగ్గిరాల బాలకృష్ణ ఎలా సాగులోకి వచ్చాడో రెవిన్యూ అధికారులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా అవినీతి, అధికార దుర్వినియోగంతో చేసిన చర్యని స్పష్టంగ కనిపిస్తున్నదని, కానీ ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని ఆయన అన్నారు. పాత మల్లంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ ఆదిలక్ష్మి ఆదివాసీల సాగు అనుభవాన్ని ధ్రువీకరించారని, తమ పంచాయతీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులు ఎటువంటి సమాచారం నోటీసులు ఇవ్వలేదని వారు తెలియజేసారన్నారు.ఏపీ శాసనసభ స్పీకర్ ప్రాథనిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో ఆదివాసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడం విచారకరమన్నారు. తక్షణం ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేయాలని, ప్రస్తుత తాసిల్దార్, గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తమ పరిశీలనను ఒక నివేదికగా జిల్లా యంత్రాంగానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అప్పటికి వారి నుండి స్పందన లేకపోతే న్యాయపోరాటంలో ఆదివాసీలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి అవసరల దేవి,AIILAJ రాష్ట్ర కమిటీ సభ్యులు జోగ ప్రసాద్,సర్పంచ్ గెడ్డం ఆదిలక్ష్మి, తెదేపా నాయకులు గెడ్డం ఆనంద్, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి జనార్దన్, గదబపాలెం ఆదివాసీల గోరా సూరిబాబు, కవల చెంచయ్య, కవల రాజుబాబు, కేదారి యర్రయ్య, కేదారి రాజేశ్వరి, గోరా ఆదిలక్ష్మి, కేదారి దేవి తదితరులు పాల్గొన్నారు.