
పయనించే సూర్యుడు అక్టోబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవల కోసం ఆశతో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తారని, రెవెన్యూ సేవల విషయంలో ఆలస్యాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సందర్భంగా, సచివాలయంలో 2025 జనవరి నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రజల నుండి అందిన 332 దరఖాస్తులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వాటిలో ఎక్కువశాతం దరఖాస్తులు వివిధ మండలాల్లో ఉన్న భూములకు సంబంధించినవని, సచివాలయ పరిధిలోని ప్రజల భూసంబంధిత అంశాలు ఇతర మండలాలకు చెందినవని ఆమె గుర్తించారు. తనిఖీలో ఒకే ఒక మ్యూటేషన్ దరఖాస్తు మాత్రమే ఎన్జీవోస్ కాలనీ పరిధిలోనిదని, మిగతా 331 దరఖాస్తులు ఇతర మండలాల పరిధిలో ఉన్న భూములపై నమోదై ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేసేలా సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ స్థాయిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే మండల రెవెన్యూ కార్యాలయాలకు పంపించి, సమయపరిమితిలో పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తనిఖీ సమయంలో రెవెన్యూ విభాగ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.