
అధికారులు రైతులతో చర్చించిన ఎమ్మెల్యే మేకపాటి
పయనించే సూర్యుడు మే 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
లక్షలు ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, గిట్టుబాటు ధర లేకుంటే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.మర్రిపాడు మండలం డీసీపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు వేలం కేంద్రం నిర్వహణాధికారి రాజశేఖర్, పాగాకు రైతులతో ఆయన గిట్టుబాటు ధరలు, సమస్యలపై చర్చించారు. పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించి వేలం కేంద్రం నిర్వహణాధికారికి వినతిపత్రం అందచేశారు. రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పరిధిలో జిల్లాలోని 16 మండలాలకు చెందిన సుమారు 2200 మంది రైతులు తమ పొగాకు ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వస్తుంటారని అన్నారు. ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. రైతులకు సాగు వ్యయం, కూలి ఖర్చులు పెరగడంతో వారు అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి పొగాకు పంటను సాగు చేశారని పేర్కొన్నారు.
వేలం కేంద్రానికి తీసుకొచ్చిన సమయంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని, ధరలు ఇలాగే కొనసాగితే ప్రతి రైతుకు రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో రైతులు పొగాకు పంటను నమ్ముకునే జీవిస్తున్నారని, వారికి ఇలాంటి ధరలు లభించడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని పేర్కొన్నారు.పొగాకు వేలం సీజన్ మూడు నెలలు ఉన్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుని 2200 మంది రైతులకు ఆదుకోవాలని, పొగాకుతో పాటు వరికి కూడా గిట్టుబాటు ధర లభించక వాటిని పండించిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారని, కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం వైపు చూపిస్తున్న శ్రద్ద రైతులపై కూడా చూపి 10 రోజుల్లో ఆశాజనకంగా పొగాకు రైతులకు ధరలు వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.
