
పయనించే సూర్యుడు న్యూస్ మే 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు ఏప్రిల్ 29-30 తేదీల్లో రజతోత్సవ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భం సభలు జరుపుకొన్నది. ఈ సభల్లో అనేకమంది ప్రముఖులు రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. మొదటిగా గత అరవై ఏళ్లల్లో (1964-2024) వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధించిన అంశాల్ని క్లుప్తంగా వివరించబడ్డాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సరల్ ప్రొ.శారదా జయలక్ష్మి దేవి, వారి సహాయకులు తమ సంస్థ లక్ష్యాన్ని, ప్రగతిని తెలిపే ఉపన్యాసాలు చేశారు. తమ ద్వారా తయారైన, తయారౌతున్న విద్యార్థుల, అధ్యాపకుల స్థాయి బహిర్గతమయ్యే కళారూపాన్ని ప్రదర్శించారు. తమ ద్వారా రూపొందిన పంట రకాలు, పశపక్ష్య జాతులు, సాంకేతిక వనరులు ఏవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయో తెలియజేశారు. మొదటి సమావేశ సభలో భారత వ్యవసాయ రంగ పోకడల పరంగా జరిగిన పరిణామాలు, సమస్యల పరిష్కార పథకాలపై, కేంద్ర వ్యవసాయ శాఖ ఉద్యోగి ప్రొ. విజరు పాల్ శర్మ ఉపన్యసించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లల్లో సాధించిన వ్యవసాయ అభివృద్ధి గురించి గణాంకాల ద్వారా వివరించారు. రైతు వ్యవసాయ అభివృద్ధి కేంద్రంగా తాము తెచ్చిన సంస్కరణల ఫలితాల్ని సగర్వంగా తెలిపారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ”ప్రకృతి వ్యవసాయ పథకాన్ని” ఏ విధంగా విస్తరింపజేస్తున్నారో విశ్రాంత ఐ.ఎ.ఎస్. అధికారి, ప్రభుత్వ సలహాదారు, రైతు సాధికారతా సంస్థ ఉపాధ్యక్షులు టి.విజయ కుమార్ విపులంగా గణాంకాలు, ఛాయాచిత్రాల ద్వారా వివరించారు. వీరి ప్రకారం, ప్రపంచంలో కేవలం రెండు శాతం మాత్రమే ప్రకృతి వ్యవసాయం నడుస్తుంటే మన రాష్ట్రంలో ఇరవై శాతం సాగుభూమి ప్రకృతి వ్యవసాయ ఒరవడిలో ఉంది. తాము గత పది ‘పది హేను ఏళ్లుగా ఈ పథకాన్ని అమలుచేసి, వివిధ నూతన అంశాల్ని ఆవిష్కరించగలిగామన్నారు. భూమి అడుగు పొరల్లో మనుగడ సాగించే వివిధ సూక్ష్మజీవులు బూజు, బ్యాక్టీరియా, వైరస్ మొదలగునవి-మొక్కల జీవన చక్రంలో అమూల్యమైన పాత్ర పోషిస్తున్నా యని గుర్తించటం తన ప్రతిభ అని శెలవిచ్చారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పెంచిన మొక్కలు గాలిలోని తేమను గ్రహించే శక్తిని పొందటం ద్వారా, సాగునీటి వనరును తక్కువ తీసుకుంటాయని తాను గుర్తించినట్లు వివరించారు. అడవిలో చెట్ల మాదిరి, పంట మొక్కలు కూడా ఏ రకమైన కృత్రిమ పోషణ, రక్షణలు లేకుండా పెరగ్గలవని నిరూపణ చేయగలిగినట్లు చెప్పారు. కేవలం ఆకు, బీజ కషాయాలు, పశు మల మూత్ర-ద్రావకాలు వాడి రసాయన పెట్టుబడి రహిత పంటల సాగు సాధ్యమని వివరించారు. దేశీయ ఆవు, స్థానిక పంట వంగడాల పాత్రను పరోక్షంగా తెలియజేశారు. ఈ తరహా పంటల సాగు వల్ల, వాతావరణ ఒత్తిళ్ల ద్వారా జరిగే నష్టాన్ని ఆపవచ్చని తాము నిరూపించామని ఛాయా చిత్రాల ద్వారా నొక్కిచెప్పారు. ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయ పథకంలో విశ్వవిద్యాలయ పాత్ర లేదని పరోక్షంగా చెప్పి ఇప్పుడు ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సమన్వయ పథకాల్ని చేయబోతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని అనేక మంది ఇతర రాష్ట్రాల, దేశాల ప్రతినిధులు సందర్శించారట. ఈ క్రమంలో ఇద్దరు రైతులు మాట్లాడుతూ…వందల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేసి వరి వంటి ముఖ్య ఆహార పంటను సాగు చేసి ఆర్థికంగా లాభపడ్డామని చెప్పుకొచ్చారు.
తమ పొలంలో పశువుల మలమూత్రాల వినియోగం ద్వారా అధిక దిగుబళ్లేకాక, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రయోజనకరమైన పంటలు పండించామని వివరించారు. దీనికి స్పందించి తమ అనుభవాల్ని కౌలు రైతు బాధల్ని చెప్పే రైతుల్ని, సమయాభావం వల్ల విరమింపజేశారు.తరువాత సెషన్లో మాట్లాడిన డా. డబ్ల్యు.ఆర్.రెడ్డి నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్-ఎన్.ఐ.ఆర్.డి నిర్దేశకుడు డా.పోతుల శ్రీనివాస్ కేంద్ర జల సాంకేతికాల అభివృద్ధి సంస్థ నిర్దేశకుడు డా. అనితా రారు ఐ.సి.ఎ.ఆర్ సహ నిర్దేశకుడు తాము గత రెండు మూడు దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని గణాంకాల ద్వారా వివరించారు. ఉత్సవ నిర్వాహకులు వీరందర్నీ ఘనంగా సన్మానించారు. వీరికంటే ముందు ఆవేశంగా ఉపన్యసించిన, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ మిషన్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల్ని రక్షించబోతున్నట్లు నొక్కిచెప్పాడు. తరువాత ఒకరిద్దరు రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వం రైతు ఉద్ధరణకై నడుం బిగించిందని పదేపదే చెప్పే సాహసం చేశారు.మధ్యాహ్నం ఏప్రిల్ ఇరవై తొమ్మిద వ తారీకు న రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మరోసారి తాము రైతు రక్షణ కొరకే నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజశేఖర్ రాష్ట్రంలో రూపొందిన కౌలు, పాడిరైతుల పరిస్థితిని, మార్కెట్ ద్వారా నష్టపోతున్న మిర్చి, పత్తి, పొగాకు రైతుల స్థితిగతుల్ని తడిమారు. అలానే వ్యవసాయ రసాయనాల వాడకంలో దేశంలోనే ముందున్న మన రాష్ట్ర పరిస్థితిని ఇరవై శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తూ కూడా చెప్పాల్సి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, కౌలు రైతుల సమస్యల్ని వ్యవసాయ సంక్షోభ మూల కారణాలని పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రి మాత్రం తాము మిర్చి, పత్తి, పొగాకు రైతుల్ని కాపాడుకొనే లక్ష్యంతో వ్యాపారుల్ని అదుపుచేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.మరురోజు ఏప్రిల్ ముప్పై వ తారీకు న జరిగిన ఉత్సవాలు విద్యార్థుల సినిమా రికార్డు డాన్సులతో మొదలై, అధ్యాపకుల జానపద సినీ-గీతాల వరసలోకెళ్లాయి. ముఖ్య వ్యక్తలైన లావు శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు లోక్‌సభ సభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల ఎం.ఎల్.ఎ మరోసారి తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం రైతు గురించే ఆలోచిస్తున్నాయన్నారు. బ్రహ్మానందరెడ్డి, అనంతపురం రైతుల మాదిరి, పల్నాడు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మళ్లేందుకు వ్యవసాయ యూనివర్సిటీ, శాఖలు తోడ్పడాలన్నారు. నీటి ఎద్దడిని తట్టుకొని మంచి ఆదాయాన్ని రైతుకి ఇవ్వగల ఖర్జూర, నేరేడు, చింత వంటి ఉద్యాన పంటల్ని పోత్సహించే దిశలో వ్యవసాయ శాఖ పని చెయ్యాలన్నారు. వీరికి సమాధానంగా డా. ఎ.సత్యనారాయణ యూనివర్సిటీ విస్తరణ శాఖ మాజీ నిర్దేశకుడు ప్రస్తుత విత్తన కంపెనీల సలహాదారు తాము 2005లోనే సూక్ష్మ క్షేత్ర ప్రాతిపదికన పంట వైవిధ్యతను వివరించామని, అది కేంద్ర ప్రభుత్వ సంస్థల దృష్టికి కూడా వెళ్లిందని, కాని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో ఉపన్యసించిన, వ్యవసాయ యూనివర్సిటీ మాజీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డా.యలమంచిలి శివాజి తన ద్వారా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయంగా మారిందో యూనివర్సిటీ శాస్త్రవేత్తల బదిలీ ప్రాతిపదిక సవరించబడ్డదో, రాష్ట్ర పంట మార్పిడి పొగాకు నుండి శనగకు జరిగిందో, పత్తి తెల్లదోమను అదుపు చేసేందుకు శుంకం లేకుండా లానేట్ వంటి ఘాటు పురుగు మందు (చాలా దేశాల్లో నిషేధించినది) ప్రవేశ పెట్టబడిందో చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే మన విశ్వవిద్యాలయం దేశంలోని ఏ సంస్థకూ తీసిపోదని, మన ఉపకులపతులు ప్రొ.స్వామినాథన్ కంటే మించిన వారనీ రెచ్చిపోయి మాట్లాడారు. వీరి తరువాత మాట్లాడిన ప్రత్యేక ఉపనాస్యకుడైన డా.చింతా గోవిందరాజులు బాపట్ల కాలేజి పూర్వ విద్యార్థి, నాబార్డు మాజీ ఛైర్మన్ తన ఆర్థిక రంగ అనుభవాల్ని వివరంగా విద్యార్థుల్ని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడాడు. ప్రపంచం, అత్యంత వేగంగా మారుతూ వ్యవసాయ రంగ రూపు మార్చుతున్నదని చెప్పుకొచ్చారు. వ్యవసాయం నేడు స్మార్ట్ యాప్‌ల తోనూ, డ్రోన్లతోనూ, రోబోట్ల తోనూ, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికాలతోనూ పురోగమిస్తున్నదని, కాని మన రైతుల వెనకబాటు మనకు సవాలుగా ఉందన్నారు. అలాగే విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు మనల్ని మారమని చెప్తున్నది. నాబార్డు ద్వారా తాను వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ఆర్థిక సహాయం చెయ్యగలిగినందుకు గర్వపడుతున్నానన్నారు. ఇంకా సాయం చేసే ఆలోచనలో ఉన్నానన్నారు.ఈ క్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ మాజీ ఉపకులప తులు, యూనివర్సిటీ స్థాయి అధికారులు తమ అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకొన్నారు. తరువాత జరిగిన వ్యవసాయ పరిశ్రమాధిపతుల, మేధోపర నిర్దేశకుల సమన్వయ చర్చలు (నూతన తరానికి యూనివర్సిటీ ఏవిధంగా ఉపయోగపడగలదో) జరిగాయి. కొందరు పరిశ్రమాధిపతులు (పూర్వ యూనివర్సిటీ విద్యార్థులు) తమ సంస్థల ద్వారా వ్యవసాయ రంగ శిక్షణ ఆధునీకరణకు, ఆర్థిక సహకారానికి తోడ్పడగలమని చెప్పారు. అందరికీ సన్మానాలు జరిగాయి. ఉత్సవాల సారాంశం వ్యవసాయం వ్యయం తుంచి, ఫల సాయం, భూ సారం వృద్ధి చేసి రైతును రక్షించే ఆధునిక దేవాలయం మన విశ్వవిద్యాలయమనే తాత్వికతతో మనం పాడుకొంటున్న గీతం…మనల్ని, రైతును, భూమిని, దేశ స్వావలంభనను కాపాడే దిశలోకి నెట్టగలిగిందా? మనకు ఆత్మ విమర్శ ఎందుకు లేదు? వ్యవసాయ రంగ ఉత్పత్తులకయ్యే ఖర్చులు కూలీల వల్లే అని నమ్మే శాస్త్రవేత్తల్ని, ప్రకృతి వ్యవసాయమే శూన్య పెట్టుబడి వ్యవసాయమని బోధించే అధికారుల్ని మన విశ్వవిద్యాలయం రూపొందిస్తున్నదా? అడ్డగోలు వ్యాపార నిలయాల అధిపతులకు తల తాకట్టు పెట్టి గౌరవ సలహాదారులుగా గడిపిన, గడుపుతున్న మేధావుల్ని ఈ విశ్వవిద్యాలయం భరించవచ్చా? రైతుని రక్షించమని, కుటుంబ వ్యవసాయాన్ని కాపాడుకుందామని…విత్తనం, భూమి, సాగునీటి కంటే…వ్యవసాయానికి ఇరుసు రైతని గుర్తు చేసిన ప్రొ. స్వామినాథన్‌తో మన వాళ్లను పోల్చవచ్చా తనకొచ్చిన ఆర్థిక పురస్కారాలతో ప్రజోపయోగం కోసం పరిశోధనా సంస్థను నడిపిన శాస్త్రవేత్తను మన ఉపకులపతులతో పోల్చవచ్చా ముప్పై ఐదు ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అనేక దేశాల్లో గుర్తించబడిన సంస్థను, మనకు నచ్చిన వ్యక్తి పేరు మీద మార్చడంలో హేతుబద్ధత ఎంత? పైరవీలతో, పై సంపాదనతో బతుకుతున్న శాస్త్రవేత్తల్ని తన అనుయాయులుగా మార్చుకొని, యాజమాన్య అధికారులుగా పదోన్నతులిచ్చే యాజమాన్య బోర్డు మొంబర్లను ఈ యూనివర్సిటీ భరించిందా రాష్ట్రంలో అనూహ్యంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు, కూలీల వలసలకు తాము బాధ్యులం ఏమాత్రం కామని చెప్పుకుంటూ బతికే యూనివర్సిటీ నిర్వాహకుల్ని ఏమనుకోవాలి? యూనివర్సిటీని ఏ మాత్రం లెక్క చేయకుండా దాతృత్య పెట్టుబడిదారుల సహకారంతో రైతు సాధికార ప్రహసనం సడుపుతున్నా పట్టించుకోని యూనివర్సిటీ యాజమాన్యాలను ఏమనాలి ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయమని కుప్పం కార్పొరేట్ల సహకార పంటల సాగని జనగాం నడిపిన ప్రహసనాలకు బాధ్యులెవరు? బుష్ వంటి అమెరికన్ పెద్దలు సందర్శించి బహుళజాతి కంపెనీల పరిష్వంగంలోకి యూనివర్శిటీని నెట్టిన విషయాన్ని ప్రముఖంగా చెప్పుకొనే మేధావులున్న యూనివర్సిటీనా ఇది? మనం రూపొందించిన పంట రకాల వల్లే, మనం తయారు చేసిన సాంకేతికాల వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందనే భ్రమల్లోకి మరో తరాన్ని కూడా నెట్టేందుకు ఈ ఉత్సవాలు తోడ్పడతాయని అర్థమౌతూనే ఉంది. అర్థ సత్యాలను, హిపోక్రసీని ఆభరణంగా ధరించిన శాస్త్రవేత్తల నిలయంగా మార్చిన గుర్తుగా ఉత్సవాలు నడిచాయా