
భద్రాచలంలోని ఐటీడీఏ పీవో రాహుల్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమిషనర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు చిన్న పెద్ద తేడా లేకుండా తమ కుటుంబాలతో కలిసి పట్టణ ప్రాంతాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో కూలి పనులు చేసుకుంటూ జీవనాధారం పెంపొందించుకుంటున్న వలస వాదులు ఎక్కడ నివసిస్తున్నారో సర్వే చేయడానికి రావడం జరిగిందని చత్తీస్గడ్ రాష్ట్రం బస్తర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ సింగ్ అన్నారు.శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్తరు జిల్లా నుండి వలస వచ్చిన వలసదారుల వివరాలు సర్వేలో భాగంగా ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ను తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐటిడిఏ ప్రాజెక్టు బి రాహుల్ బృందం సభ్యులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల పక్క రాష్ట్రము నుండి వలస వచ్చిన వారు ఎక్కువ శాతం పల్లె ప్రాంతాలలో ఇతర పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, కానీ ఇక్కడ నివసిస్తున్న కోయ తెగలతోపాటు గుత్తి కోయలు కూడా పల్లె ప్రాంతాలలో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారని బృందం సభ్యులకు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వలసవాదులు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వివరాలు సేకరించడానికి ఐటిడిఏ తరుపున జూనియర్ అసిస్టెంట్ ను ఆ బృందం వెంట పంపించడం జరిగిందని అన్నారు. బస్తర్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈ జిల్లాలకు రావడం జరిగిందని పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ నివసిస్తున్న వలసవాదుల కుటుంబాలు ఎంతమంది ఉన్నారు, తిరిగి వారు స్వరాష్ట్రానికి వచ్చేది రానిది వారి ఇండ్లకు వెళ్లి ఆ సభ్యులను అడిగి తెలుసుకుని, పూర్తిస్థాయిలో సర్వే చేసి బస్తర్ జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుందని ప్రాజెక్టు అధికారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, బృందంలోని సభ్యులు రవీంద్ర టిక్కీ, ధీరజ్ నాగ్ తదితరులు పాల్గొన్నారు.