
పయనించే సూర్యుడు మే 10. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తూతకలింగన్నపేట గ్రామ సమీపంలోని పొలాల్లో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన చింతన బోయిన నరసింహారావు, చింతనబోయిన రామదాసు కు చెందిన రెండు పాడి గేదెలను గురువారం ఉదయం మేత కోసం సమీపంలోని పొలాల వైపు తోలారు. దీంతో అవి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో శుక్రవారం ఉదయం వారిరువురూ వెతుక్కుంటూ పొలాల వైపు వెళ్ళగా గ్రామ సమీపంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన పంతగాని జానకి రాములు పొలంలో విద్యుత్తు తీగలు తగిలి రెండు గేదెలు మృతి చెందినట్లు గుర్తించారు. గురువారం సాయంత్రం మండలంలో గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది దీంతో కేసు పల్లి ఫీడర్ కు చెందిన త్రీఫేస్ విద్యుత్తు స్తంభాలు రెండు పొలంలో పడిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో గేదలు అటువైపు మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. పాడి గేదెలు కావడంతో రెండు గేదలు సుమారు రెండు లక్షల విలువ చేసినట్టుగా గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి పశు వైద్యాధికారి సుబ్బారావు వెళ్లి పరిశీలించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
