
బెల్టు షాపులో జోరుగా మద్యం విక్రయాలు…
పట్టించుకోని అధికారులు
1). రుద్రూర్ వైన్స్ లో మద్యం నిల్ దృశ్యం..
2). బెల్టు షాపులో మద్యం విక్రయాలు…
రుద్రూర్, అక్టోబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలో గల వైన్స్ లో మద్యం ఖాళీ అయింది. పలు గ్రామాల బెల్ట్ షాపుల నిర్వాహకులు గత వారం రోజుల ముందే మద్యం బాటిళ్ళను విక్రయానికి వైన్స్ నుండి తీసుకెళ్లడంతో వైన్స్ లో మద్యం ఖాళీ అయింది. వైన్స్ లో స్టాక్ తెప్పియాలంటూ మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం ప్రియులు వైన్స్ కు బారులు తీస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక రెట్లకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం టెండర్లు వేయడంతో, రుద్రూర్ వైన్స్ నిర్వాహకులు స్టాక్ తెప్పియడం లేదు. వైన్స్ లో స్టాకు కొరకు వైన్స్ నిర్వాహకులు ఎక్సైజ్ సీఐ కు ఫోన్ చేయగా, సీఐ స్పందించడం లేదని నిర్వాహకులు ఆరోపించారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, రాయకూర్, సులేమాన్ నగర్, అంబం తదితర గ్రామాలల్లో బెల్టు షాపుల్లో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారు. దసరా పండుగ, గాంధీ జయంతి కావడంతో వైన్స్ లలో మద్యం లేకపోవడంతో బోధన్ మండలం సంఘం గ్రామంలో సోమవారం రాత్రి బెల్టు షాపులో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 20 వేల రూపాయల విలువైన మద్యాన్ని దొంగిలించిన సంఘటన వెలుగు చూసింది. కానీ బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేయడమే తప్పు.. కానీ పోలీసులు దొంగిలించిన మద్యంపై కేసు చేయడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటారా లేదా?..అని వేచి చూడాల్సి ఉంది.
