
పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.13/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ప్రభుత్వం నూతనంగా ఎంపిక చేసిన 32 మంది ఉపాధ్యాయులు సోమవారం వీధుల్లో చేరారు.కూటమి ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే గత ఏడాది అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి మెగా డీఎస్సీ ఈ ఏడాది నిర్వహించింది.ఇందులో భాగంగా మండలానికి 32 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు కేటాయించారు.ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు మండల విద్యా వనరుల కేంద్రాన్ని చేరుకొని వారి నియామక పత్రాలను ఎంఈఓ రవికి అందించారు.ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ రవి నూతన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ 32 మంది ఉపాధ్యాయులలో పదిమంది స్కూల్ అసిస్టెంట్లు,మిగిలిన 22 మంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉన్నట్టు పేర్కొన్నారు.సమాజాన్ని సరైన దిశలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు, సమాజ వికాసానికి బాసటగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.