పోలవరం ప్రాజెక్టుతో జేబులు నింపుకున్నది నాన్ ట్రైబల్స్ మరియు అధికారులు మాత్రమే
అగమ్య గోచరంగా ఆదివాసులు బతుకులు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 25 అల్లూరి సీతారామరాజు జిల్లా
శనివారం నాడు దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ దేవీపట్నం మండలం భూకబ్జాలకు నిలియంగా మారిపోయిందని మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ దేవీపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వ, ఆదివాసి భూములను కబ్జా చేసి అక్రమ మార్గంలో పోలవరం ప్యాకేజీలు పొందారని అంతేకాకుండా ప్రభుత్వ భూములు కబ్జా చేసి తిరిగి ప్రభుత్వానికే అమ్మి కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర దేవీపట్నం మండలంలో ఉన్నదని ఇంతటి మహత్కార్యానికి పాల్పడటానికి కారకులు అధికారులు ప్రజాప్రతినిధులని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తిరిగి ప్రభుత్వానికే కోట్ల రూపాయలకు అమ్ముతుంటే అసలు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు సిగ్గుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నష్టపరిహారం పేరుతో గాని, పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణాలకు భూసేకరణ విషయంలో గాని నాన్ ట్రైబల్స్ ముంపుకు గురైన చోట్ల కోట్ల రూపాయలు దండుకున్నారు భూసేకరణలో భూములు అమ్ముకుని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు నాన్ ట్రైబల్స్ కు అధికారులకు వరంగా, ఆదివాసులకు శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. నేటికీ దేవీపట్నం మండలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు వంటివి తాత్కాలిక భవనాల్లోనే కొనసాగుతున్నాయని, వందల ఎకరాల భూములు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకొని ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. మరోపక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అసలైన ఆదివాసులు నిర్వాసితులుగా మారి దశాబ్దాలు దాటిన వారికి నేటికి సరైన భూమి ప్యాకేజీ అందలేదని, పోలవరం నిర్వాసిత ఆదివాసి గ్రామాలు అగమ్య గోచరంగా ఉన్నాయని సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతూ ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. గత ప్రభుత్వాలు గానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం గానీ ఆదివాసి నిర్వాసితులను గాలికి వదిలేసాయని, కానీ కబ్జాలు చేసిన నాన్ ట్రైబల్స్ కి మాత్రం కోట్లు దోచిపెట్టి సకల సౌకర్యాలు కల్పించారని ఆయన మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో భూములు అన్ని అన్యాక్రాంతం అవ్వటానికి 100 శాతం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని వీళ్ళు కరెక్ట్ గా ఉంటే భూములు ఎందుకు అన్యక్రాంతమవుతాయని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీ ఆదివాసి ప్రజల పట్ల స్థానిక అధికారులు, ఐటిడిఏ అధికారులు,రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా చిన్నచూపే చూస్తున్నారని, 1/70 చట్టాన్ని ఉల్లంఘించి వలసలు వచ్చి స్థిరపడినటువంటి నాన్ ట్రైబల్స్ కాలనీలు గాని గ్రామాలు గాని అన్ని మౌలిక సదుపాయాల తోటి వర్ధిల్లుతున్నాయని ఆదివాసి గ్రామాలు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఆదివాసి గ్రామాల్లో పర్యటించాలని ఆయన డిమాండ్ చేశారు. గత పది రోజులుగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ పరిధిలో అనేక మండలాల్లోని గ్రామాలను పర్యటించడం జరిగిందని, వెళ్లిన ప్రతి గ్రామాల్లో ఆదివాసులు సమస్యలు కోకొల్లులుగా కనిపించాయని, మరి అవి ప్రభుత్వ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించటం లేదని ఆయన ప్రశ్నించారు. ఆదివాసి చట్టాలు అమలు చేసే విషయంలో ఆదివాసి సమస్యలు పరిష్కరించే విషయంలో అలస్తత్వం వహిస్తే ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు. దేవీపట్నం మండలంలోని పోలవరం ఆదివాసి నిర్వాసిత కాలనీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, భూమికి భూమి మరియు ప్యాకేజీ అందని వారికి తక్షణమే గుర్తించి అందించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీఠప్రసాద్, కొండ దొరల సంఘం నాయకులు యాలగడ్డ నాగేశ్వరావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు కంగాల అబ్బాయి దొర, చోడి ఏడుకొండల రావు దొర, జోగిరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

