
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
రేపు నామినేషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
ఆర్భాటాలు లేకుండా కేవలం నలుగురితోనే నామినేషన్ కార్యక్రమం
ఈ నెల 19న భారీ ర్యాలీకి గులాబీ శ్రేణుల సన్నాహాలు
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ.. వినూత్న ప్రణాళికతో ముందుకు వెళుతోంది. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌ను ఎలాంటి ఆర్భాటం లేకుండా, అత్యంత నిరాడంబరంగా దాఖలు చేయాలని నిర్ణయించింది.రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో మాగంటి సునీత తన నామినేషన్‌ను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం నలుగురు ముఖ్య నేతలతో కలిసి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, నామినేషన్ నిరాడంబరంగా పూర్తి చేసి, ఆ తర్వాత ప్రచారాన్ని హోరెత్తించాలని బీఆర్ఎస్ ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ ఉపఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ముఖ్య నేతలు ఇకపై జూబ్లీహిల్స్‌లోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. దివంగత నేత మాగంటి గోపీనాథ్‌కు నియోజకవర్గ ప్రజలు ఇచ్చే నిజమైన నివాళి సునీత గెలుపేనని పార్టీ నేతలు ప్రచారంలో పేర్కొంటున్నారు. ఇప్పటికే సమీక్షలు, సమావేశాలతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తున్నారు.మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా గెలుపు కోసం తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. తొలిరోజే 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెలువడనున్నాయి.