Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// ముక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్// ఫిబ్రవరి 22 తేదీ // రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తొలి దశలో జిల్లా కేంద్రాల్లో ఆ తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించాలని చెప్పారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిదిగా నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. “పట్టణ, గ్రామీణ సంఘాలన్న తారతమ్యాలు లేకుండా మహిళలంతా ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉన్నది. కోటి మందిని చేర్చుకుని అవకాశం వస్తే ఏదో ఒకరోజు మహిళలందరూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం మన మహిళా శక్తిని ప్రపంచానికి చాటుదాం. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానిద్దాం. ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ప్రజా పాలనలో మహిళలకే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వారు ఆత్మగౌరవంతో బతికినప్పుడే ఆ కుటుంబాలు నిలబడుతాయి. మహిళా సంఘాలకు ఇప్పటికే అనేక పనులు అప్పగించాం.

✳️అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, సూళ్లల్లో పిల్లల యూనిఫామ్‌లు కుట్టించే కార్యక్రమాలను అప్పగించాం. ఐకేపీ కేంద్రాలు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులు ఆర్టీసీకి అద్దెకు నడిపించే కార్యక్రమం ప్రారంభమైంది.

✳️దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం కల్పించాం. అదానీ, అంబానీలతో పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఆడబిడ్డల చేతికి ఇచ్చాం. గ్రామాల్లో మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి వీలుగా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో అత్యంత ఖరీదైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశాం.

✳️67 లక్షల మహిళా సంఘాల సభ్యులకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు వెచ్చించి ఏటా రెండు చొప్పున 1.3 కోట్ల నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం.

✳️పాఠశాలల్లో ముఖ్యంగా ఆడపిల్లల బాధలు వారి తల్లులకే ఎక్కువగా తెలుస్తాయి. అందుకే స్కూళ్ల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించాం. బడులను బాగా చూసుకోవాలి. నిధులు ప్రభుత్వం ఇస్తుంది. నిర్వహణ మీరు చూసుకోవాలి. నిర్వహణ సరిగా చేయకపోతే ప్రయోజనం ఉండదు. టీచర్లు రాకపోతే కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి. టీచర్లు రాకపోతే ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది.

✳️ఊర్లో గుడి కోసం మనమంతా తలా ఒక చేయి వేసి ఎలా అభివృద్ధి చేసుకుంటున్నామో అదే తరహాలో బడిని కూడా ఆ రకంగా నిర్వహించుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అదే తీరులో చూసుకోవాలి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

✳️ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లోక్‌సభ సభ్యులు డీకే అరుణ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments