
నేత్రపర్వంగా రామయ్య పట్టాభిషేకం
హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
స్వాగతం పలికిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ప్రజా ప్రతినిధులు
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ
భద్రాద్రిలో మిన్నంటిన రామనామ స్మరణలు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
కళ్యాణ రాముడు రారాజుగా మారారు. ‘తక్కువేమీ మనకు రాముడు ఒక్కడుండు వరకు …..’అంటూ భక్తుల శ్రీరామ నామ స్మరణలు మిన్నంటాయి. అర్చకుల వేద మంత్రోచ్ఛారణతో మిధిలా ప్రాంగణం పులకించింది. దక్షిణ అయోధ్యపురి భద్రగిరి భక్తులతో అలరారింది. శ్రీరామ పట్టాభిషేకం వేడుక నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఈ మహోత్సవ వేడుకలకు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకలైన శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం తదితర మహోత్సవాలకు హాజరైన భక్తజనం తీపి జ్ఞాపకంతో వెనుదిరిగిందివైభవంగా శ్రీ రాముడి పట్టాభిషేకం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని మిధిలా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం వేడుక భక్తులను అలరించింది. తొలుత రామాలయం భద్రుని మండపంలో అర్చక స్వాములు స్వామివారి పాదుకలకు అభిషేకం జరిపారు. రాజ లాంఛనాలతో పవిత్ర పావన గౌతమీ నదీ తీరం నుంచి తీర్థములు తీసుకొచ్చారు. భాజా భజంత్రీల సందడి, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటంతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. శిల్పకళా శోభిత కళ్యాణ మండపంపై స్వామివారు ఆశీనులయ్యారు. అర్చక స్వాములు తొలుత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. స్వామివారికి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణం ధరింప చేశారు. శ్రీరామ పట్టాభిషేక పారాయణం గావించారు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఆదరణ వేదం, విష్ణు పురాణం, భగవత్ శాస్త్రం తదితర పారాయణములు గావించారు. పుష్కర నది జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ చేశారు. పుష్కర నది జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ గావించారు.11 శ్లోకాలను పట్టించి స్వామివారికి హారతి ఇచ్చారు. అర్చక స్వాములు భక్తులచే పలు స్తోత్రాలను పఠింపజేశారు. శ్రీరామ నామ స్మరణలతో మిధిలా ప్రాంగణం ప్రతిధ్వనించింది. పట్టాభిషేకం అనంతరం భక్తులపై అర్చక స్వాములు పుణ్య నదీ జలాలను చల్లారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మహోత్సవాన్ని ఆధ్యాంతం తిలకించారు. తొలుత రామాలయంలో గవర్నర్ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్, రామాలయం ఈవో రమాదేవి తదితరులు పట్టాభిషేకం వేడుకలో పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య వేడుకలైన శ్రీ సీతారాముల వారి కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకానికి దేశ నలుమూలల నుంచి హాజరైన భక్తజనం తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగారు. ఈ వేడుకల విజయవంతంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి కీలక భూమిక పోషించారు.