
నీటి లీకేజీ తోనే 30వేల ఎకరాల్లో ఎండిన వరి పంటలు.. – లష్కర్లు లేక అస్తవ్యస్తంగా నిర్వహణ
పయనించే సూర్యుడు //న్యూస్ ఏప్రిల్ 16////మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//మక్తల్
రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండలంలోని సంగంబండ వద్ద నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు షట్టర్ల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీంతో ప్రాజెక్టులోని సాగు నీరంతా లీకేజీల రూపంలో వృధాగా వెళ్లి దాదాపు 30వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుకు అమర్చిన మొత్తం 10 షట్టర్లలో ఐదు షట్టర్లు బ్రేక్ డౌన్ అయ్యాయని ఆయన అన్నారు. మిగతా 5 షట్టర్లల్లో మూడు షట్టర్లలో నుంచి నీరంతా లీకేజీ రూపంలో దిగువకు వృధాగా పోతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టు వద్ద నీటిని విడుదల చేసేందుకు లష్కర్లను సైతం నియమించకపోవడంతో నిర్వహణ ఘోరంగా మారిందన్నారు. దీంతో ఈ ప్రాజెక్టునే నమ్ముకొని పంటలను సాగుచేసిన మక్తల్, మాగనూరు, నర్వ, కృష్ణ మండలాల్లోని రైతులు సాగు నీరందక అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ నాలుగు మండలాల్లోని దాదాపు 30 వేల ఎకరాల్లో సాగునీరు అందక రైతులు సాగుచేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. దీంతో రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఈ దుస్థితికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి పరిస్థితికి ప్రభుత్వం మేల్కొని తక్షణమే సంగం బండ షట్టర్ల ను మరమ్మతు చేసి రాబోయే వర్షాకాలం సీజన్లోనైనా నీరు వృధాగా పోకుండా అరికట్టి రైతులను కాపాడాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.
