
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 17:- రిపోర్టర్( కే శివకృష్ణ )
ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం అని రావూరి నరసింహ వర్మ ప్రశంసించారు. బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన కందుకూరి వీరేశలింగం 177 వ జయంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. కందుకూరి వీరేశలింగం 130 కి పైగా రచనలు చేశారని 158 కథలు రచించారని తెలియజేశారు. తెలుగులో రాజశేఖర చరిత్రము అనే తొలి నవల కందుకూరి వారే రచించారని అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కందుకూరి సామాజిక రుగ్మతలు రూపుమాపటానికి వివేకవర్ధిని, సాహితీహిత బోధిని అనే పత్రికలు స్థాపించారన్నారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి సమాజ హితం కోసం ఎంతగానో పోరాడారు అని అన్నారు . 40 వితంతు వివాహాలు జరిపించారు అని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ వీరు తొలిసారిగా అభ్యుదయ సాంఘిక నాటకాలు రచించి దర్శకత్వం వహించి ప్రదర్శించారన్నారు. ఆ కారణంగా కందుకూరి జయంతిని “తెలుగు నాటక దినోత్సవం” గా 2007లో ప్రభుత్వం ప్రకటించిందని తెలియజేశారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ కందుకూరి మహిళా అభ్యుదయం కోసం, మహిళా విద్య కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ సభలో మర్రి మాల్యాద్రి రావు ఎం జాకాబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి కాళిదాసు తదితరులు కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.