
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి జిల్లా రహదారులపై ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన రహదారి భద్రత ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లాలో ఎక్కువ నిడివి కలిగిన జాతీయ రహదారులతో పాటు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రహదారులు ఉన్నాయని తెలిపారు. బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో రహదారి భద్రతపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ చికిత్స నిమిత్తం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తరఫున ప్రణాళిక రూపొందించాలని డీఎంహెచ్‌వో ను ఆదేశించారు. ముందుగా జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రహదారి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న గుర్తించిన ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు గల కారణాలపై అధ్యయనం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రాణాలు పోకుండా తక్షణమే ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్న దగ్గరి రహదారులు, హాస్పిటళ్లను ఎంపిక చేయాలని తెలిపారు. అదేవిధంగా అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రమాదాలు సంభవించకుండా రహదారులపై సైన్ బోర్డులతో పాటు, రేడియం స్టిక్కర్లు, జీబ్రాలైన్లు, స్టాపేజీలు వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో మోటార్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికిఅధికమవుతున్నాయన్నారు. వాహనాలు కండిషన్ గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జైలు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశంలో గుర్తించి వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని. కళాశాలలు మరియు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకుగాను ప్రమాద దృశ్యాల వీడియోలు మరియు ఫోటోలు ద్వారా ప్రమాదానికి గురైన వారి తల్లిదండ్రులు పడే వేదనను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. జిల్లాలోని రహదారుల్లో ప్రమాదకరమైన మలుపుల వద్ద అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలన్నారు. రహదారులు వెంట ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలోని ప్రధాన కూడళ్ళలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటుచేసిన పోల్స్ మాదిరిగానే జిల్లావ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల్లో ప్రమాదాల నియాత్రలకు అన్ని శాఖలు సమన్వయంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ఆర్ అండ్ బి ఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి,డి సి హెచ్ ఓ రవిబాబు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.