
“వలసలు ప్రోత్సహించే చర్యలు మానుకోవాలి !…
టూరిజం వలన మా బ్రతుకులు మారవు !…
ఆదివాసీ సంఘాల కూటమి”(ASK) నాయకులు
పయనించే సూర్యుడు రిపోర్టర్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ ఏప్రిల్ 18
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ భవనంలో “ఆదివాసీ సంఘాల కూటమి” (ASK) ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా 5 వ షెడ్యూల్ ఏరియా అయిన ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి పేరిట టూరిజాన్ని అడ్డం పెట్టుకుని 1/70 చట్టాన్ని సవరణ చేసే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని, 1/70 చట్టం జోలికొస్తే ఖాభద్దార్ అంటూ “ఆదివాసీ సంఘాల కూటమి”(ASK) నాయకులు “ఆదివాసీ చైతన్య వేదిక” అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి, “ఆదివాసీ గిరిజన సంఘం” నాయకులు లోతా రామారావు మరియు “ఆదివాసీ సంక్షేమ పరిషత్” (274/16) జిల్లా అధ్యక్షులు తీగల బాబురావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు . టూరిజం వలన గిరిజనేతర వలసలు పెరుగుతాయని, అందువల్ల పెసా చట్టం అమలుకాదని, పెసా చట్టం అమలు జరగకపోతే 1/70 చట్టం నిర్వీర్యం అయ్యి ఏజెన్సీ చట్టాలకు, హక్కులకు విఘాతం కల్గుతుందని,కాబట్టి టూరిజం పేరిట వలసలు ప్రోత్సహించే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. టూరిజం వలన ఆదివాసీల బ్రతుకులు మారవని, ఆదివాసులు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందేలా వారికి ట్రైకార్ లోన్స్ ద్వారా 5 లక్షలు రూపాయలు వ్యక్తిగత రుణాలు సబ్సిడీతో ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు జి. ఓ 3 స్థానంలో మరో జి. ఓ తీసుకోచ్చి చట్టం చేసి 100 శాతం ఉద్యోగాలు కల్పించాలని, రైతులకు ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ఆర్థిక భారాన్ని తగ్గించి, వారు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి దళారీ వ్యవస్థను నిషేదించాలని, మహిళామనులకు ఇంట్లో ఉండి ఆదాయం పొందే విధంగా స్వయం ఉపాధి కల్పించాలని, ప్రస్తుత విద్య వ్యవస్థ తీరు నాణ్యత లోపంతో ఉందని, విద్య విధానంలో ఆదివాసీల ప్రయోజనం చేకూరేలా ఏజెన్సీ ప్రాంత విద్య ఉండాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అధికారులు నిజాయితీగా పని చేయాలని, జూదాలు, నాటు సారా తయారీ, గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఈ విధంగా అమలు చేస్తే ఏజెన్సీ అభివృద్ధిలోకి వెళ్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో asp నాయకులు చోడి ప్రదీప్ దొర, కంగాల అబ్బాయి దొర, చోడి ఏడుకొండలు దొర, పీఠ ప్రసాద్, ఆదివాసీ ఉద్యోగ సంస్కృతిక సంక్షేమ సంఘాం నాయకులు, ఆదివాసీ నాయకులు గొర్లె నారాయణ, జి. బాబురావు, పెసా కమిటీల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.