
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 20. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయిక్
- భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకోవాలి… భూ సేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ రాజేశ్వరి
- భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం
- నేలకొండపల్లి మండలం మంగాపురం తాండ, నేలకొండపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన భూ సేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ ఖమ్మం/నేలకొండపల్లి,
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని భూ సేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ అధికారిణి ఎం. రాజేశ్వరి తెలిపారు. శనివారం నేలకొండపల్లి మండలం మంగాపురం తాండ, నేలకొండపల్లి గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను నియోజకవర్గ ఇంచార్జ్ అధికారిణి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, నిర్వహిస్తున్న రిజిస్టర్లు, దరఖాస్తుదారులకు ఇస్తున్న రశీదు, ఏ ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నది పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకుంటున్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకుని, భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ అధికారిణి మాట్లాడుతూ, రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రత భావాన్ని తావు నీయకుండా జవాబుదారుతనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్ధం అయ్యేలా సామాన్య, గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి చట్టం ఉందన్నారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు భూ భారతి లో అవకాశం ఉందన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేయవచ్చన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టంలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు. భూదార్ కార్డుల జారీ జరుగుతుందన్నారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి, ఎవరైనా ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం చట్టంలో ఉందన్నారు హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉంది రికార్డులో లేనివారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ అధికారిణి అన్నారు. మంగాపురం తండా గ్రామంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 223, నేలకొండపల్లి గ్రామానికి సంబంధించి 52 దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులకు అధికారులు రశీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ తఫజ్జుల్ హుస్సేన్, నాయబ్ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్ఐ లు శ్రీనివాస్, రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
