
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..
జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 పొనకంటి ఉపేందర్ రావు
భద్రాద్రి కొత్తగూడెంను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలు వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాల యజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే పేరెంట్స్ టీచర్ సమావేశాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్లే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని అన్నారు.గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై యదార్థ సంఘటన ఆధారంగా వారి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపడుతుందో వీడియోల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాలు ద్వారా అలవాటు మానిపించాలన్నారు. చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదకద్రవ్యాలను అలవాటు పడిన పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టుల ద్వారా నిరంతరనిగా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి తో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములను పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా అటవీశాఖ అధికారులు జిల్లాలో 50 శాతం పైగా అటవీ భూములు ఉన్నాయని, అడవిని నమ్ముకుని ఉన్న ఆదివాసి గిరిజనులకు అభివృద్ధి చెందేలా ఇప్ప, కరక్కాయ, వెలగా, ఉసిరి మరియు చింత మొక్కలను విస్తృతంగా నాటేలా అవగాహన చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచన విధానం, ఆలోచన శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో సికిల్ సెల్ ఎనీ మియా వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి రక్తం అవసరమవుతుందని, కాబట్టి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి శరత్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ కరంచంద్, ఎక్సైజ్ సీఐ జానయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, కొత్తగూడెం ఆర్ టి ఓ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు