
పయనించే సూర్యుడు న్యూస్ మే 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
విదేశీ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు ఇతర దేశాలలో నిర్మించిన సినిమాలపై పడింది. విదేశీ భూభాగంపై నిర్మించే సినిమాలపై వంద శాతం సుంకం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలుచేసే అధికారాన్ని అమెరికా వాణిజ్య శాఖకు, వాణిజ్య ప్రతినిధులకు అప్పగించారు. అయితే తన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారో ఆయన వివరించలేదు. ‘ఇతర దేశాలు మన నిర్మాతలను, స్టూడియోలను అమెరికా నుండి దూరం చేయడానికి అనేక రాయితీలు అందజేస్తున్నాయి. దీనివల్ల అమెరికాలోని హాలీవుడ్, అనేక ఇతర ప్రాంతాలు నాశనమై పోతున్నాయి. అన్ని దేశాలు కలిసి సమిష్టిగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇది దేశ భద్రతకు ముప్పు’ అని ట్రంప్ తెలిపారు. ప్రధానంగా వాల్ట్ డిస్నీ కంపెనీ, పారమౌంట్ గ్లోబల్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటివి నష్టపోతాయి. ‘చైనాపై అధిక సుంకాలు విధించాలని ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా అమెరికా సినిమాలపై మా ప్రేక్షకులకు ఉన్న సానుకూలత బాగా తగ్గిపోతుంది’ అని చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ గత నెల పద వ తేదీన ఒక ప్రకటనలో తెలియజేసింది.