
పయనించే సూర్యుడు న్యూస్ మే 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఎండలు పెరిగిన క్రమంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎండ బాగా తగిలినప్పుడు శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. చెమట పోయదు. అప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగుతూ శరీరాన్ని సమతులంగా ఉంచుకోవాలి. బయట పనులకు వెళ్లేవారికే కాదు, ఇంట్లో ఉన్నవారికి కూడా వడదెబ్బ తగులుతుంది. ఈ పరిస్థితి వచ్చే వరకూ ఉండకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడొచ్చు.
జి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లకూడదు. పగటిపూట పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయలుదేరే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ లేదా లస్సీని తీసుకోవాలి. తల, చెవులను పూర్తి తెల్లని మెత్తని క్లాత్‌తో కప్పుకోవాలి. లేదా గొడుగు తప్పనిసరిగా వేసుకోవాలి.ఒక వాటర్ బాటిల్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఈ నీళ్లలో కాస్త సాల్ట్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మంచిది. ఏసీ నుంచి డైరెక్ట్‌గా ఎండలోకి వెళ్లవద్దు. అలాగే ఎండలో తిరిగివచ్చి డైరెక్ట్‌గా ఏసీ గదికి వెళ్లకూడదు. కొంచెం సమయం తీసుకున్న తర్వాత వెళ్లాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని ఐస్ లేదా నీటితో తుడవాలి. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. అందులో త్వరగా జీర్ణం అయ్యే ఆకుకూరలు, పప్పు కూరలు ఉండాలి. నీరు శాతం అధికంగా ఉండే సొరకాయ, దోసకాయ, పొట్లకాయ వంటి కూరగాయలు తీసుకోవాలి. నూనె బాగా తగ్గించాలి.వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. దాహంగా ఉన్నప్పుడు కూల్‌డ్రింగ్స్ తాగకూడదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ తాగాలి. వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి.ఓఆర్ఎస్, గ్లూకోజ్ నీళ్లు కొంచెం కొంచెంగా తీసుకోవాలి. కీరదోస, పుచ్చకాయ ముక్కల్ని ఎక్కువగా తినాలి. దీనివల్ల శరీరానికి నీటితోపాటు పోషకాలు కూడా అందుతాయి. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది. ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.