
నల్ల బంగారంతో రాష్ట్రానికే వెలుగులు జిమ్మిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
గిరిజన జిల్లాను అభివృద్ధిలో నవ కాంతులతో ముందుకు తీసుకువెళ్తాం..
గోదావరి నదిపై నావిగేషన్ అధ్యయనం చేపట్టాలి…
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పయనించే సూర్యుడు మే 17 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి రోడ్డు, రైల్వే, ఎయిర్ మరియు జల రవాణా వ్యవస్థలు అవసరమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పలు విద్యుత్ ఉప కేంద్రాలు మరియు కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతం మరియు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రామాలయం చుట్టూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తగూడెం నుండి కౌతాలంపూర్, కొత్తగూడెం నుండి హైదరాబాద్ వయా ఇల్లందు రహదారుల నిర్మాణం జరుగుతుందని అలాగే పోలవరం, సమ్మక్క సారక్క, అన్నారం, సుందెల్ల మరియు కాలేశ్వరం రిజర్వాయర్లు పూర్తి అయినవి కాబట్టి నావిగేషన్ అధ్యాయనం చేపట్టి జల రవాణా కు ప్రణాళికలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ని కోరారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ కోసం గతంలో సూచించిన స్థలం ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని కారణాల వలన అనుమతులు లభించలేదని, ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు త్వరలోనే మళ్లీ అధ్యయనం చేపడతామని తెలిపారు. గిరిజన జిల్లా అయినటువంటి జిల్లాలో నల్ల బంగారంతో రాష్ట్రానికే వెలుగులు జిమ్మిన జిల్లా లో అభివృద్ధి ఆగకుండా మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలకి ఏది అవసరమో వాటిని అందించడంలో ప్రభుత్వం ముందు ఉంటుందని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు తమ పరిధిలో కెనాల్ నిర్మాణానికి భూమి సేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థికపరమైన కష్టాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తూ ఈ గిరిజన జిల్లాను నవ కాంతులతో మెరిసే విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, రైతు కూలీలు, కార్మికులు మరియు ఉద్యోగులు వారి అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్కు ఎటువంటి లోటు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి 6 విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించడమే లక్ష్యంగా ఈరోజు జిల్లాలో ఈ శంకుస్థాపనలు చేపట్టమని మంత్రి తెలిపారు. పామాయిల్ తోటలకు లోవెల్టేజీ సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అడవి స్థానంలో ఆయిల్ ఫామ్ సాగు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో గిరిజనులు పోడు భూమిలో ఎక్కడైతే నీటి సౌకర్యం లేదో అక్కడ వెదురు పెంపకం ద్వారా ఆదాయం గడించి గిరిజనులు ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారని అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగులో అంతర్పంటగా మునగ సాగు చేపడుతూ కలెక్టర్ సారధ్యంలో రైతులు అభివృద్ధి చెందుతున్నారు అన్నారు. ఒక మాట చెప్పగానే దానిపై అధ్యయనం చేసి, పరిశీలించి దానికి కావలసిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి అనుమతులు తీసుకుంటున్న డైనమిక్ కలెక్టర్ ఉండటం ఈ గిరిజన ప్రాంతం అదృష్టం అని మంత్రి కొనియాడారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొరకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన వెంటనే ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని ప్రపంచవ్యాప్తంగా మన జిల్లా విద్యార్థులు రాణిస్తారని మంత్రి ఆకాంక్షించారు. త్వరలోనే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.