
ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో సిసిఎఫ్ – రాజమండ్రి వారికి ఫిర్యాదు.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 25
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (CCF)- రాజమండ్రి వారికి ఏజెన్సీ ప్రాంతాల్లోని అటివిశాఖకు సంబంధించిన భూములను నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకొని అనేక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మరియు ఇతర వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ, చింతూరు అటవీ శాఖ కి సంబంధించిన( సిల్వర్ జూబ్లీ పార్క్) స్థలాన్ని నాన్ ట్రైబల్ స్ ఆక్రమించుకొని స్థిర నివాసాలు వ్యాపార సముదాయాలునిర్వహిస్తున్నారని, అదేవిధంగా రంపచోడవరం డివిజన్ పరిధిలో నర్సాపురం, బర్నగూడెం, బి రామన్నపాలెం లోని నల్లరాయి క్వారీలు, గంగవరం మండలంలోని నల్ల పూడి, చిప్పరపాలెం గ్రామంలోని అక్రమ గ్రైనేట్ మైనింగ్, అడ్డతీగల మండలంలోని వైరామారం రోడ్డు వైపు దుప్పులపాలెం సమీపంలో గల రంగురాళ్ల క్వారీలకు అటవీశాఖ అనుమతులు లేవని, స్థానిక ఆదివాసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా ఈ మైనింగ్‌లు కొనసాగిస్తున్నారని సిసిఎఫ్ గారికి తెలియపరిచినట్లు ఆయన అన్నారు. అలాగే దేవీపట్నం మండలంలోని అక్రమ కలప రవాణా, గ్రావెల్ (మట్టి) రవాణా భారీ స్థాయిలో జరుగుతున్నాయని వీటిపై స్థానిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. అలాగే మారేడుమిల్లిలోని గిరిజన యేతరులు స్థానిక అధికారుల సహకారంతో అడివి వెదురు బొంగులను విచ్చలవిడిగా కొట్టి బొంగు చికెన్ వ్యాపారం విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని వీరికి ఎటువంటి అనుమతులు లేవని తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆదివాసులకు మాత్రమే బొంగు చికెన్ వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని సిసిఎఫ్ గారిని కోరడం జరిగింది. పాఠశాలలలో, హాస్టల్స్ లలో గ్యాస్ ద్వారా వంటలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, పాఠశాల హాస్టల్స్ యాజమాన్యాలు గ్యాస్ ద్వారా వంటలు చేయనీయకుండా అటవీ కలప ద్వారా వంటలు చేస్తున్నారు దీని ద్వారా కూడా అడివి అంతరించిపోతుందని తెలియజేశారు. అంతేకాక పర్యాటక ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం నిబంధనలు ఉన్నప్పటికీ ఆకతాయిలు భద్రాచలం, సీలేరు ,పాడేరు రోడ్డు మరియు భద్రాచలం -రాజమండ్రి జాతీయ రహదారులు పై, అడవులలో ప్లాస్టిక్ సంచులు బాటిళ్లు మందు సీసాలు పారి వేస్తున్నారని దీని మూలాన పర్యావరణ కాలుష్యంతో పాటు అడివిలో నివసించే జీవజాలానికి హాని కలుగుతుందని తెలియజేశారు. అలాగే అడవి ప్రాంతంలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్లలో అనేక ప్రాణాలు పోతున్నాయని దీనికి కారణం మైనింగ్ నిర్వహులైన నాన్ ట్రైబల్స్ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. వీటన్నిటి పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీసీఎఫ్ గారు తెలియజేసినట్లు ఆయన అన్నారు. అలాగే అటవీ సంరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు అటవీశాఖ తో కలిసి పని చేయాలని పర్యావరణాన్ని రక్షించాలని అడవులు అంతరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రజల భాగ్యస్వామ్యంతోనే ప్రకృతిని కాపాడుకోగలమని సిసిఎఫ్ గారు సూచించినట్లు ఆయన ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. సిసిఎఫ్ గారిని కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తో పాటు రంపచోడవరం డివిజన్ నాయకులు పీట ప్రసాద్ ఉన్నారు
