పయనించే సూర్యుడు జనవరి10( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి)
పాల్వంచ టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియా లో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో శుక్రవారం నాడు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, భోగి పండ్లు కార్యక్రమాలను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి కరస్పాండెంట్ జి భాస్కరరావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. అన్ని పండుగలు తిధి ఆధారముగా జరుపుకుంటామని, సంక్రాంతి పండుగను మాత్రం కాల గమనం ఆధారంగా జరుపుకుంటామని తెలియజేసినారు.సంక్రాంతి సూర్యునికి ప్రీతి పాత్రమైన పండుగని,అందుకనే సూర్యుని రంగు,రూపం పోలిన భోగిపండ్ల లో నాణెములు, అక్షింతలు, బంతి చేమంతి పూలరెమ్మలు కలిపి చిన్నపిల్లలపై పోస్తారని దీనివల్ల సూర్య భగవానుని ఆశీర్వాదం పిల్లలపై ఉండి ఆరోగ్యంగా ఉంటారనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. గంగిరెద్దు ఆటలు, హరిదాసు కీర్తనలు,ముత్యాల ముగ్గులు ఈ పండుగ ప్రత్యేకత లని తెలియజేసినారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రంగవల్లుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలచినది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.