
ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి పిలుపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ సిఐటియు కార్యాలయంలో ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ తమపై జరుగుతున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పని గంటల తగ్గింపుకు, పని పరిస్థితుల మెరుగుకై, కనీస వేతనం పెరిగిన ధరలకు వేతనాల పెంపుకై, ఓటు హక్కుకై . ఉద్యోగ భద్రత. సుదీర్ఘ పోరాటల ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 115 ఏండ్ల చరిత్ర ఉందని, అంతకన్నా ఎక్కువ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా మహిళల పోరాటాలకు ఉందన్నారు. తరతరాల నుండి మన సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో వేళ్ళూలుకొని ఉండటంమూలాన మహిళలు అవమానాలకు, హింసకు, దాడులకు గురౌతూనే ఉన్నారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించామని అభివృద్ధి వైపుకు దూసుకుపోతున్నామని మన పాలకులు చెప్పుకుంటున్నప్పటికీ ఆడ పిల్లలపై, మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక దాడులు, ప్రేమోన్మాద హత్యలు పెరుగుతున్నాయని, ఖాఫ్ పంచాయతీల పేరిట, పరువు హత్యల పేరిట, వరకట్న దురాచారాల పేరిట, గృహ హింస పేరిట భారతదేశ వ్యాప్తంగా దళిత, వెనుకబడిన, ముస్లిం, మైనారిటీ, గిరిజన, ఆదివాసీ మహిళలపై అమానుషంగా దాడులూ, హింస పెచ్చరిల్లుతుందన్నారు. ప్రభుత్వాలు మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుక తిరుగుతున్నప్పటికీ శ్రామిక మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో ప్రభుత్వం మొండిచెయ్యే చూపెడతావుందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ఆదాయ అసమానతలు, శ్రమదోపిడీ వల్ల శ్రామిక మహిళలు కునారిల్లిపోతున్నారు. ఒకవైపు చేద్దామంటే పని దొరకకపోవడం, పని దొరికినా తక్కువ వేతనాలు, అధిక పనిగంటలు, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు వంటి అనేక సమస్యలు మహిళలను వెంటాడుతున్నాయి. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాట స్పూర్తితో సమాజంలో గౌరవంగా జీవించడం కోసం, ఉపాధికోసం, పని భద్రత కోసం, సమాన పనికి సమాన వేతనాల కోసం, ఉచిత విద్య-వైద్యం కోసం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మహిళా హక్కుల కోసం పురుషులను కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం అంజమ్మ. సత్తెమ్మ. నరసమ్మ .లక్ష్మమ్మ శంకరమ్మ. శారద అనసూయ. లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు