
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22:
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో కొమరం భీమ్ 125 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా కె. రత్న మాణిక్యం తెలియజేసారు. తొలుత కొమరం భీమ్ చిత్రపటానికి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం అసఫ్ జాహి నిజాం నవాబ్ కు వ్యతిరేకంగా పొరాడిన అదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీమ్ అనీ, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పద్ధతి లో పోరాడారన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ మాట్లాడుతూ కొమరం భీమ్ ‘జల్ ,జంగల్ ,జమీన్’(నీరు, అటవీ, భూమి) అనే నినాదంతో అదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులను సమీకరించి సాయుధ పోరాటం చేసారన్నారు. ఆయన చేసిన పోరాటం ఆదివాసి హక్కుల కోసం జరిగిన ఉద్యమాలకు చిహ్నంగా నిలిచిందన్నారు. చరిత్ర విభాగాధిపతి బి. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన అమరుడు కొమరం భీమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె.శైలజ, ఆర్.మౌనిక,ఎం ఆనంద్,కె.లక్ష్మి ప్రసన్న కుమారి తదితర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
