
పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ సమీక్ష సమావేశం ను బుధవారం ఐడిఓసి కార్యాలయం డి ఆర్ డి ఓ కార్యాలయం నందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జిల్లాలో నీరు మరియు పారిశుద్ధ్య అమలు, మరుగుదొడ్ల నిర్మాణం మరియు వినియోగం, ప్రతి గ్రామానికి త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ కార్యక్రమాల ద్వారా వ్యర్ధాల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి సరఫరాలో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఎద్దటి లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జలాల పెంపొందించేందుకుగాను జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు మరియు రైతు వేదికలు అన్నిటిలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధి హామీ పనులు జరుగు ప్రదేశాలలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు మరియు విద్యుదీకరణ పనులు త్వరితను పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మరియు ఆసుపత్రుల్లో మహిళలు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు శానిటేషన్, పారిశుధ్యం పై అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రతి పాఠశాల నందు ఇంకుడు గుంతల నిర్మాణం, పాఠశాల ఆవరణలో ఔషధ మొక్కలు మరియు పాఠశాల విద్యార్థులకు ఔషధ మొక్కల గురించి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పాఠశాలల్లో సీడ్ బ్యాంకు ద్వారా విత్తనాల సేకరణ చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులు పాఠశాలలలో ఇన్సులిన్ ప్లాంట్స్, తులసి, లెమన్ గ్రాస్, తిప్పతీగ తదితర ఔషధ మొక్కలను విస్తృతంగా నాటాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని బోర్ ద్వారా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పౌండ్స్ నిర్మించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఫామ్ పౌండ్స్ నిర్మాణం ఉచితంగా నిర్మించవచ్చు అన్నారు. భూగర్భ జలాలు పెంపొందించడం కోసం ఫామ్ పౌండ్స్ నిర్మాణాలు తప్పనిసరి అన్నారు. ఈ సంవత్సరం కనీసం 10,000 ఫామ్ పౌండ్స్ నిర్మించడమే లక్ష్యం అన్నారు. రైతు వేదికలలో ఇంకుడు గుంతలతో పాటు ప్లాంటేషన్ చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు. జిల్లాలోని ఆసుపత్రులు మరియు పంచాయతీలలో వ్యర్ధాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ ఏడి రమేష్, ఇరిగేషన్ ఈఈ అర్జున్ రావు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.