
కష్టపడి చదివితే ఉన్నత స్థానాలు సాధ్యమే..
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు ఆగస్టు29(పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం:తల్లిదండ్రుల త్యాగాలు వృధా కాకుండా విద్యార్థులు చదువును అభ్యసించి,ఉన్నత స్థాయికి చేరాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ఇంజనీరింగ్ మరియు బిఎస్సి మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ వి రామచంద్ర, జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య కోసం ఇంటి నుండి దూరంగా పంపే సమయంలో అనేక అపోహలు కలిగి ఉంటారని, ఎలాంటి అపోహలు ఉంచకుండా విద్యార్థులను స్వేచ్ఛనిచ్చి చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలు మంచి పేరు సంపాదించగలరని ఆయన సూచించారు.ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ డే ను అందరం ఘనంగా నిర్వహిస్తామని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల లేసి నివాళులు అర్పిస్తామన్నారు. కానీ ఆయన ఏ కళాశాల నుండి విద్యనభ్యసించారు, వారి యొక్క గురువులు గురించి ఎవరికీ తెలియదని ఆయన తెలిపారు.1861 లో కర్ణాటకలో జన్మించి ఇంజనీరింగ్ లో ప్రతిభ కనబరిచి దేశానికై గర్వకారణ మైన అనేక ప్రాజెక్టులను రూపొందించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధునిక సదుపాయాలు లేనప్పటికీ ఆయన కృషి, నిబద్ధతే నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ తాను విద్యనభ్యసించేటప్పుడు ఎటువంటి సదుపాయాలు లేవని కిలోమీటర్ల దూరం నడిచి విద్యనభ్యసించే వాళ్ళమని కానీ మంచి ఉపాధ్యాయులు, ల్యాబ్ సౌకర్యాలు ఉండటం వల్ల నైపుణ్యం సాధించి ఈ స్థాయికి చేరుకోగలిగామని ఆయన అనుభవాలు విద్యార్థులతో పంచుకున్నారు.విద్యార్థులు పుస్తకాలతో పాటు ప్రత్యక్ష అనుభవాల ద్వారా నైపుణ్యాన్ని సాధించాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఆయన తాను విద్యార్థి దశలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూనివర్సిటీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వసతి గృహాలు, ల్యాబ్లు ఆడిటోరియం మరియు క్రీడా మైదానం వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ మన జిల్లాలో స్థాపించడానికి గల కారణం జిల్లాలో కోల్ మైన్స్, హెవీ వాటర్ ప్లాంట్, వేడి నీటి గుంతలు వంటి జియోలాజికల్ వైవిధ్యం ఉండటం వలన ఈ యూనివర్సిటీ ఇక్కడ స్థాపించడం జరిగిందని దీని ద్వారా విద్యార్థులు జియాలజీలో ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం ద్వారా నైపుణ్యం సాధించవచ్చు అని తెలిపారు. విద్యను అభ్యసించిన అనంతరం దేశ విదేశాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాము, కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.