
ఏప్రిల్ 30 లోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి దశలో లబ్ధిదారులకు సహకారం అందించాలి
భూ భారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యల పరిష్కారానికి కృషి
ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ ఫీజులో 25% రాయితీ గడువు పొడిగింపు ఉండదు
ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఎల్.ఆర్.ఎస్ పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొంగులేటి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22( పొనకంటి ఉపేందర్ రావు )
పేదల సొంతింటి కల నిజం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్ లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫిరెన్స్ హాల్ నుంచి జిల్లా *కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా *మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడు సొంత ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రజా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఉచితంగా సబ్సిడీ కింద అందిస్తుందని, దేశంలో మరే రాష్ట్రంలో ఇంత పెద్దన సాయం అందడం లేదని, మిగిలిన రాష్ట్రాల్లో లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ప్రభుత్వాలు సహాయం చేస్తుంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను అందిస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడత లో 3 వేల 500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని అన్నారు. మనకు వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, జనాభా ఆధారంగా గ్రామాలకు, మున్సిపల్ వార్డులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలని అన్నారు. గ్రామాలు, మున్సిపల్ వార్డులో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితా ఎంపిక చేయాలని, ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇండ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఏప్రిల్ 30 లోపు మరో సారి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి నాణ్యతతో పారదర్శకంగా జరగాలని, ఇందిరమ్మ కమిటీలు అందించిన జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే మంజూరు చేసే జాబితా నుంచి తొలగించాలని అన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లలో బేస్మెంట్ లెవల్ పూర్తి చేసుకున్న వారికి మొదటి విడత కింద లక్ష రూపాయలను ఇటీవలే విడుదల చేశామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పెద్ద సంఖ్యలో గ్రౌండ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడ సామాగ్రి ధరలు అనుభవంగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాపారులు ఎక్కడ కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని, బలహీన వర్గాల ఇంటి నిర్మాణానికి ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నందున, ప్రతి మండల కేంద్రంలో ఇసుక అందుబాటులో పెట్టాలని మంత్రి తెలిపారు. మండలంలో నిర్మించిన మోడెల్ ఇండ్లు నమూనాలను లబ్ధిదారులకు చూపించాలని మంత్రి అధికారులకు సూచించారు. పేదలకు ఇంటి నిర్మాణంలో ప్రతి దశ లోను అధికారులు సహాయం అందించాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని అన్నారు. 5 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నందున అత్యంత నిరు పేదలకు మొదటి విడతలో ఎంపిక చేయాలని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో అత్యుత్తమ మార్కులు వచ్చిన యువకులను తాత్కాలిక ప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇంజనీర్లుగా నియమిస్తున్నామని, వీరికి అవసరమైన శిక్షణ అందించి త్వరలోనే మండలాలకు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి మండలంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ సదరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల సహాయం త్వరగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో స్లం ఏరియాలో జి+3 మోడల్ లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు వీలుగా లబ్ధిదారులు ముందుకు వస్తే రాబోయే విడత లలో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. భూ భారతి చట్టం మన రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద 4 మండలాలలో ముందస్తుగా అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి సూచించారు. 4 మండలాలో రెవెన్యూ సదస్సులు పూర్తిచేసుకున్న తర్వాత అందులో నుంచి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో ఒక మండలం నుంచి తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి జిల్లాకు అవసరమైన సర్వే సామాగ్రి అందించడం జరుగుతుందని అన్నారు. భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయిలో తూచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పై అధికంగా ఉంటుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రజలకు భారం కాకుండా 25% రాయితీని అందించామని, దీనినే ముఖ్యమంత్రి ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించామని అన్నారు. మరోసారి ఎల్.ఆర్.ఎస్ 25% రాయితీ గడువు పొడిగింపు మరొక్కసారి ఉండదని ఈ అంశాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకుని వెళ్లి, ఆమోదం పొందిన దరఖాస్తుల ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పి డి హౌసింగ్ శంకర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.