Monday, August 18, 2025
Homeఆంధ్రప్రదేశ్పేదల చిరకాల వాంఛ నెరవేరుతోంది…

పేదల చిరకాల వాంఛ నెరవేరుతోంది…

Listen to this article

భద్రాద్రి రాముని సాక్షిగా చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం…

లక్ష మందితో జరగనున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం..

బెండలంపాడు గ్రామంలోసీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం..

పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇళ్లు అందజేస్తున్న ప్రభుత్వం..

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

పయనించే సూర్యుడు ఆగస్టు 18 (పొనకంటి ఉపేందర్ రావు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామం లో ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టరాగమయి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు అన్న కల కలగానే మిగిలిపోయింది అని అన్నారు. అయితే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ పథకాన్ని పునఃప్రారంభించి, మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్ల మంజూరుతో పేదవాడి చిరకాల వాంఛను ఈ పేదోడి ప్రభుత్వం అయినా ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ శ్రావణ మాసం, 21వ తేదీన శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండలంపాడు గ్రామం లో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అని తెలిపారు. ఈ గ్రామంలో మొత్తం 312 ఇండ్లు మంజూరయ్యగా, వాటిలో 72 ఇండ్లు పూర్తి అయ్యాయి. అందులో 27 ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదగా గృహప్రవేశం జరగనుంది. గతంలో ఏ పేదవాడికీ అందని ఇళ్లను ఇప్పుడు ఈ ప్రభుత్వం పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి అర్హునికి అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇళ్లలో, సుమారు 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన ఇళ్లు కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులైనవారికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఈరోజు అదే భద్రాద్రి నేలపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం జరగడం ఒక చారిత్రక ఘట్టం అని తెలిపారు. జిల్లాలో జరిగే ఈ మహోత్సవానికి సుమారు ఒక లక్ష మంది ప్రజలు పాల్గొంటారని అంచనా. కాబట్టి, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని గొప్ప విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.20వ తేదీ మధ్యాహ్నం నుంచే ఇక్కడ ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తాను అని మంత్రి తెలిపారు . అధికారులు చిన్నచిన్న తప్పిదాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవాడి కలలను నిజం చేసే ఈ గృహప్రవేశోత్సవాన్ని ఘనవిజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఆగస్టు 21 మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రుగొండకు ముఖ్యమంత్రి చేరుకుంటారని, 2:10 బెండలంపాడు చేరుకుని 2:20 కు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ఒక్కో ఇంటి వద్ద 15 నిమిషాలపాటు లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 3:00 గంటల నుంచి ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. ఈ సందర్భంలో పోలీస్ బందోబస్తు, వీఐపీల ప్రోటోకాల్, ప్రజా రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై ఎస్పీ వివరాలు తెలియజేశారు. రెవెన్యూ శాఖ అదనపు కలెక్టర్ మొత్తం సమన్వయం చేపడతారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సమీపంలోని 30 కిలోమీటర్ల పరిధిలోని మండలాల నుండి ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల (SSGs) సభ్యుల రాకపోకలపై ప్రత్యేక మొబిలైజేషన్ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ప్రధాన శాఖలవారీగా తగిన ఏర్పాట్లు చేయాలని, బాధ్యతలు విభజించినట్లు కలెక్టర్ వివరించారు. రోడ్ల మరమ్మత్తులు, బురద తొలగింపు, పిచ్చి మొక్కల నివారణ, డోజర్లు వినియోగం, స్టోన్ డస్ట్ వేసే పనులు సమయానికి పూర్తిచేయాలని, వర్షాల వలన మళ్లీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 19వ తేదీ సాయంత్రానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, లైటింగ్, తాగునీరు, పార్కింగ్, ప్రజా సౌకర్యాలు, డయాస్ ఏర్పాటు, మీడియా కోసం ప్రత్యేక వేదిక, బారికేడింగ్, భద్రత వంటి అంశాలన్నీ విభాగాలవారీగా సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున ఎక్సైజ్, సిపిఓ, పోలీసు అధికారులు సమగ్రంగా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ , మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా విచ్చేసి గృహప్రవేశాలలో భాగస్వాములు కావడం గిరిజనుల పట్ల ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనం అని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం వలన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. అధికారులందరూ తమ విధి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం మంత్రి కలెక్టర్, ఎస్పీ మరియు శాసన సభ్యులతో కలిసి హెలిపాడ్ మరియు సభా ప్రాంగణం మరియు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ ఐ డి సి చైర్మన్ మొవ్వ విజయ్ బాబు,అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ట్రైన్ కలెక్టర్ సౌరబ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీవో మధు, అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments