Sunday, May 25, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రణాళికాబద్ధంగా యువతకు ఉపాధి కల్పన చర్యలు….. డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

ప్రణాళికాబద్ధంగా యువతకు ఉపాధి కల్పన చర్యలు….. డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

Listen to this article

పయనించే సూర్యుడు. మే 25. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

  • 80 కు పైగా కంపెనీలలో 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహణ
  • 100 కోట్లతో వైరా ప్రాంతానికి సాగునీరు అందించే రాజీవ్ కెనాల్ పూర్తి చేసాం
  • 9 వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం క్రింద స్వయం ఉపాధి ప్రోత్సాహం
  • వైరా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సి.ఎం

యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు. 5 వేలకు పైగా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వైరా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ఉద్యోగ మేళాలో 80 కు పైగా కంపెనీలు పాల్గొని, 5 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని , యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని మార్గాలు అన్వేషించి అమలు చేస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, దీనిని అందరూ వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, చిన్న ఉద్యోగం ఐనా ముందు జాయిన్ కావాలని, ప్రతి నిమిషం విలువైనదని, ఉద్యోగం చేస్తూ కూడా యువత తమ అభివృద్ధి, లక్ష్యాల సాధన కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని డిప్యూటీ సీఎం సూచించారు. యువత అనేక ఆశలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొందని, కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించ లేకపోయారని, యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. పట్టణాలలో మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు 9 వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నామని అన్నారు. వైరా శాసనసభ నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా కార్యక్రమంలో 8 వేలకు పైగా యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో చాలా మందికి నేడు ఉపాధి లభిస్తుందని అన్నారు. వైరా నియోజకవర్గ పరిసరాలలో ఉన్న నాగార్జున సాగర్ కాల్వ, వైరా చెరువు, ఇతర చెరువులకు సమృద్ధిగా నీరు అందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం క్రింద ప్రత్యేకంగా రాజీవ్ కేనాల్ ను 100 కోట్ల రూపాయలతో పూర్తి చేశామని అన్నారు. వైరా చెరువు కాల్వల పునరుద్ధరణ కోసం 44 కోట్లు మంజూరు చేశామని అన్నారు. చిన్న నీటి బొట్టు వదలకుండా రైతుల పొలాలకు సాగునీరు మళ్లించేలా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులకు దాదాపు 21 వేల కోట్లతో 2 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి చేశామని, రైతు భరోసా క్రింద 18 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని అన్నారు. పంట భీమా అ మలు చర్యలు తీసుకుంటున్నామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందించామని, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు సాగునీరు సౌకర్యం కల్పించేందుకు 12 వేల 600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించామని, ఈ పథకం క్రింద 2 లక్షల 10 వేల ఎకరాల భూములలో బోర్లు, సోలార్ మోటార్, డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఈ సంవత్సరమే 5 లక్షల రూపాయల విలువైన ఇందిరమ్మ ఇళ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 మంజూరు చేస్తామని, రాబోయే ఐదు సంవత్సరాల పాటు డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించనున్నామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నదని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో వైరా నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, యువతకు అవసరమైన స్కిల్ అందించేందుకు ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేశామని అన్నారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాబ్ మేళా కు దాదాపు 8 వేల మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకుందని, దాదాపు 5 వేల మందికి 80 కంపెనీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. యువతకు వచ్చిన అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని, జాబ్ మేళా లో వచ్చిన ఉద్యోగాల్లో ఎటువంటి సమస్య వచ్చినా అవసరమైన సహకారం జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామని అన్నారు. మెగా జాబ్ మేళా నిర్వహణలో సహకరించిన డిప్యూటీ సీఎం కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఎంపికయిన యువతకు వివిధ కంపెనీల ఆఫర్ లెటర్ లను డిప్యూటీ సీఎం అందజేశారు.
ఈ మెగా ఉద్యోగ మేళాలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సింగరేణి సిఎండి బలరాం, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సింగరేణి జనరల్ మేనేజర్ శాలోమ్ రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments