
//పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 29//
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో గత నెల రోజులుగా ప్రజలు మిషన్ భగీరథ తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి ఆరోపించారు. దాదాపు 25 వేల జనాభా కలిగిన మక్తల్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు ప్రతిరోజు సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తాగునీటి సరఫరా చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలు తాగేందుకు నీరు లేక కలుషిత నీటిని తాగే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే స్థానిక మున్సిపల్ కమిషనర్ ఈ విషయమై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు కూడా నీటిని సక్రమంగా అందించడం లేదన్నారు. ఈ విషయమై ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది అన్నారు. దీంతో గత నెల రోజులుగా ప్రజలు కలుషితనీటిని తాగుతూ అనేక రోగాలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు స్పందించి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలని, లేనిచో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.