
మే నెల చివరి వరకు ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి
భూ సేకరణ జరిగిన భూముల వివరాలు అప్ డేట్ చేయాలి
భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు , ఇందిరమ్మ ఇండ్ల, నీట్ పరీక్ష నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి వర్యులు పొంగులేటి
పయనించే సూర్యుడు మే02 (పొనకంటి ఉపేందర్ రావు)
భూ భారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సిసిఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ లతో కలిసి భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.*ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లా లలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్ట్ క్రింద వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై ప్రజల నుంచి 12 వేల 759 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్రవ్యాప్త రెవెన్యూ సదస్సులు సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భూ భారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తు నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రభుత్వ భూములలో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్ లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. పట్టాలు ఉండి పొజిషన్ లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని అన్నారు. హై కోర్టు నుంచి అనుమతి రాగానే సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూ సర్వే కు సంబంధించిన సమస్యలు, ఆర్.ఎస్.ఆర్ ఎక్సస్ సమస్యలు పరిష్కరించాలని, భూ సేకరణ కింద ప్రభుత్వం సేకరించిన భూముల రికార్డులు అప్ డేట్ చేయాలని మంత్రి కలెక్టర్ లను ఆదేశించారు. మే నెల చివరి వరకు రెవెన్యూ సదస్సులు వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా పరిష్కారం చూపాలని మంత్రి పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పట్టాలు ఎవరైనా విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారు భూమి లేని నిరుపేద లైతే ప్రభుత్వం చర్చించి ఎంత భూమి క్రమబద్ధీకరించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కూడా కృషి చేయాలని అన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను ముందుగా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు త్రాగు నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, ఓఆర్ఎస్ ప్యాకేట్లతో చిన్న మెడికల్ క్యాంపు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన మేర పోలీస్ భద్రత కల్పించాలని అన్నారు.ప్రశ్న పత్రాలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూం వద్ద సిసిటివి ఉండాలని, పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల గేటు మధ్యాహ్నం 1.30 గంటలకు మూసి వేయాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని, బయో మెట్రిక్ అటెండెన్స్ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ పీఎం ఆవాస్ యోజన కింద లక్షా 13 వేల ఇండ్లు మంజూరయ్యాయని, ప్రతి నియోజకవర్గ పరిధిలోని పట్టణ ప్రాంతాలలో కనీసం 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూడాలని మంత్రి అన్నారు. పి.ఎం.ఎల్.ఏ పోర్టల్ లో లబ్ధిదారుల ధ్రువీకరణ ఆధార్ నెంబర్ లతో పూర్తి చేయాలని, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మొదటి విడత కింద 700 కోట్ల పైగా నిధులు వస్తాయని అన్నారు.600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే మనకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావని, లబ్ధిదారులకు వివరించి రెండవ దశలో 600 చదరపు గజాల లోపు కట్టేలా చూడాలని అన్నారు.పైలెట్ గ్రామాలలో మనం మంజూరు చేసిన 51 వేల ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటివరకు 10 వేల ఇంటి నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయని, 2019 ఇండ్లు బేస్మెంట్ పూర్తి చేసుకుంటే ఇటీవలే లక్ష రూపాయలు విడుదల చేశామని, ఇంటి నిర్మాణాలలో పురోగతి రావాల్సిందేనని, కలెక్టర్లు హౌసింగ్ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రతి మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్లను ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. ప్రతిరోజు ఇంచార్జి మంత్రులతో సమన్వయం చేస్తూ అర్హుల జాబితా ప్రకటించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, మే 10వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఇండ్లు గ్రౌండ్ చేయాలని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద వార్త పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు రిజెండర్ జారీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ప్రజలకు చెల్లింపులు సకాలంలో అందుతుందని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావు మాట్లాడుతూ, భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులను చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తుల స్క్రూటిని మార్గం సుగమం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి భూ భారతి సమస్యల పరిష్కారం చేపట్టాలని అన్నారు.మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్రంలోనే 24 జిల్లాల పరిధిలో 190 పరీక్షా కేంద్రాలలో నీట్ ప్రవేశ పరీక్ష జరుగుతుందని , 72 వేల 507 అభ్యర్థులు పరీక్షలు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో జరిగిన ఎటువంటి పొరపాట్లు మరో సారి పున:రావృతం కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లకు సూచించారు.నీట్ ప్రవేశ పరీక్షకు జిల్లా స్థాయిలో చేస్తున్న ఏర్పాట్ల గురించి అభ్యర్థులకు తెలిసే విధంగా పత్రికల, మీడియా ద్వారా ప్రచారం కల్పించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.పేదలకు ప్రభుత్వం అందించే శాశ్వత ఆస్తి ఇందిరమ్మ ఇండ్లని, ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మమైన కార్యక్రమం అని, అర్హుల జాబితా ఎంపిక చేయడం చాలా కీలకం అవుతుందని, అనర్హులకు పథకం అందితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సి.ఎస్ పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సహాయం అందే విధంగా మార్గదర్శకాలను పాటించాలని సిఎస్ అధికారులకు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో అధికారులు దరఖాస్తులు పరిశీలించి సంతకం చేయడం ద్వారానే లబ్ధిదారులను గుర్తింపు చేపడుతున్నామన్నారు. పేదలలో బహు పేద వారికి మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.ఈ వీడియో సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, కొత్తగూడెం ఆర్డీవో మధు, హౌసింగ్ పీడీ శంకర్,సుజాతనగర్ తహసీల్దార్ మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.