
అనుచరుడి చేతిలో హతం కుషాయిగూడలో కలకలం
పయనించే సూర్యడు/ సెప్టెంబర్ 13/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు
రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరుడి చేతిలోనే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం హతుడైన శ్రీకాంత్ రెడ్డి (45) హెచ్‌బీ కాలనీ, మంగాపురం కాలనీ, కుషాయిగూడలో కుటుంబంతో నివాసముంటూ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. లాలాపేటకు చెందిన ధనరాజ్ (40) అతని అనుచరుడిగా వ్యాపార లావాదేవీల్లో వెన్నంటి ఉండేవాడు. ఇటీవల ఆర్థిక విషయాలపై ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. వివాద పరిష్కారానికి శుక్రవారం ధనరాజ్, శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలో కలుసుకున్నారు. ఇద్దరూ మద్యం సేవించిన తర్వాత వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కొద్దిసేపట్లోనే గొడవ రోడ్డుపైకి చేరగా, ధనరాజ్ తన వద్ద ఉన్న కత్తితో శ్రీకాంత్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని బెదిరించి పారిపోయాడు. స్థానికులు 108కు ఫోన్ చేసి సహాయం కోరగా, చేరుకున్న వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు యత్నించినా అప్పటికే శ్రీకాంత్ రెడ్డి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే హత్య చేయాలన్న ప్రణాళికతోనే ధనరాజ్ కత్తి తీసుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కరరెడ్డి వెల్లడించారు.