
పయనించే సూర్యుడు జులై 12 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
నాణ్యమైన పామాయిల్ మొక్కలను మాత్రమే రైతులు నాటేలా చర్యలు
నవంబర్ నాటికి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించాలి
పామాయిల్ సీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలి
జిల్లాలో వక్క తోట సాగుకు ప్రయోగాత్మకంగా చర్యలు
కొణిజెర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
కొణిజెర్ల రైతులు ఆదాయం వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రివర్యులు, శనివారం కొణిజెర్ల మండలం, అంజనాపురం గ్రామంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతుల సందేహాలను శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.వి. ప్రసాద్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు డ్రిప్ సౌకర్యం త్వరితగతిన ఏర్పాటు చేయాలని, ఆయిల్ పామ్ పంట సాగు లాభాలను వివరిస్తూ పంట విస్తీర్ణం పెరిగేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటే సమయంలో తప్పనిసరిగా గుంతలు 2 ఫీట్ల వరకు తవ్వాలని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కల నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలను మాత్రమే రైతులకు అందించాలని, నర్సరీలో ఉన్న లోపాలను పూర్తి స్థాయిలో తొలగించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పామాయిల్ మొక్కల నాణ్యతను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పామాయిల్ ఫ్యాక్టరీ నవంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆ దిశగా పనులు పూర్తి చేయాలని అన్నారు. రిఫైనరీ పనులు కూడా స్థానికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ఫ్యాక్టరీ త్వరగా ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వానికి, రైతులకు ఆదాయం అధికంగా లభిస్తుందని అన్నారు. సీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాలు అందిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా సీడ్ ఫ్యాక్టరీ లేదని, మన దగ్గర ఏర్పాటు చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ లో ఒప్పందం చేసుకున్నారని, అవసరమైన భూమి రైతులకు ఎటువంటి నష్టం లేకుండా సేకరించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
మన దగ్గర రెండు, మూడు ఎకరాలలో పామాయిల్ పంట సాగు చేస్తే మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తే లభించే ఆదాయం కంటే ఎక్కువ సంపాదించే ఆస్కారం ఉంటుందని అన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగిస్తూ పామాయిల్ దిగుబడి పెరిగేలా చూడాలని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వక్క మొక్కలు నాటామని అన్నారు. మన దగ్గర పొలాలలో వక్క తోటలు పండించడానికి ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 నెలల కాలంలో లక్షా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేశామని అన్నారు. మే నెలలో కురిసిన వర్షాలతో కొంత మంది రైతులు పంట సాగు ప్రారంభించారని, ప్రస్తుతం వారికి ఇబ్బంది కలగకుండా సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి జలాలను నాగార్జున సాగర్ ఆయకట్టుకు సరఫరా చేసేందుకు నిర్ణయించి నేడు విడుదల చేశామని అన్నారు. రైతులు వరి కు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అన్నారు. ప్రస్తుతం తాను వక్క తోట సాగు చేస్తున్నానని, ఈ పంట 60 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుందని, తన సాగు బాగా జరిగితే మిగిలిన రైతులకు కూడా ఈ పంట విస్తరించేలా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నేడు జరిగిన పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమం విజ్ఞాన వేదికగా ఉపయోగపడిందని అన్నారు. పామాయిల్ పంట సాగు సంబంధించి చేసే పొరపాట్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి క్లుప్తంగా వీడియోలు తయారు చేసి వాట్సప్, యూట్యూబ్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. పామాయిల్ పంటకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరని, ప్రస్తుత వానాకాలం సీజన్ లో 7500 ఎకరాలలో పామాయిల్ పంట విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 4 వేల ఎకరాల్లో పామాయిల్ పంట విస్తీర్ణం చేశామని, మరో 3 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణకు హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారి ఇబ్బందులను మంత్రి ఆదేశాలు మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆదాయం పెంచే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని, మన దగ్గర ఆదర్శవంతమైన రైతులు ఉన్నారని, మంచి పంటల సాగుకు మనం ముందుంటూ ఇతర ప్రాంతాలకు ఆదర్శవంతంగా ఉండాలని, పామాయిల్ సాగులో రైతులకు జిల్లా యంత్రాంగం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో *వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ రైతులు నమ్మకంతో పామాయిల్ పంట సాగు చేస్తున్నారని, చిన్నకారు రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని, రైతులు నష్టపోకుండా చూసుకోవాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు.
రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన సహాయ, సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని, ఇప్పటికే 18 సంవత్సరాలు గడిచిందని, ఫ్యాక్టరీ ప్రారంభం ఇంకా ఆలస్యం చేయవద్దని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి ప్రోత్సాహంతో తాను కూడా 25 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేయడం జరిగిందని అన్నారు. ఆయిల్ పామ్ పంట పై అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్ గా పెట్టాలని అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో రైతులు పామాయిల్ వైపు ఆసక్తి చూపుతున్నారని, ఆ ప్రాంతానికి నాగార్జున సాగర్, భక్త రాందాసు నుంచి సాగు నీళ్ళు వస్తాయని, సీతారామ ప్రాజెక్టు కూడా లింక్ అవుతుందని పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని, ఇక్కడ పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పామాయిల్ పంట సాగు సబ్సిడీ విడుదల, డ్రిప్ ఏర్పాటుకు ఎటువంటి లిమిట్ పెట్టకుండా ఉండాలని అన్నారు. 5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, కొణిజర్ల మండల తహసీల్దార్ అరుణ, విద్యుత శాఖ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.వి. ప్రసాద్, గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతినిధులు, అగ్రి హార్టికల్చర్ సొసైటీ సలహాదారు నల్లమల వెంకటేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
