
- మారుతున్న పోటీ వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
- ఉన్న వనరులను ఉపయోగించుకొని పిల్లల జీవితాలు బాగు చేయడంలోనే మన విజయం ఉంటుంది
- జిల్లాలో డిఎస్సి-2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయుల బోధన శిక్షణ లో దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్
పయనించే సూర్యుడు. మార్చి 01 ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం : ఆధునిక విద్యలో మార్పులను అవగతం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల జీవితాలలో స్పష్టమైన మార్పు సాధించే దిశగా ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం స్థానిక ఎన్నెస్పీ కాలనిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యా శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి-2024 ద్వారా ఇటీవల నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. బోధన అంశాలు తెలుగు, గణితం, ఇంగ్లీషు, ఈవీఎస్ బోధన, పాఠశాల, తరగతి గదులలో ఉన్న వనరులను సద్వినియోగం, స్వయంగా సౌకర్యాలు సృష్టించుకొని విద్యార్థులుకు అందించే ఆధునిక విద్య వ్యవస్థ పై నూతన ఉపాధ్యాయులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. నూతనంగా విధులలో చేరిన ఉపాద్యాయులను ఈ మూడు నెలల్లో బోధన అనుభవాలు, పాఠశాల పరిస్థితులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్య పై కొత్త టీచర్లు తమ, తమ అభిప్రాయాలను కలెక్టర్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలోని మార్పులకు సమానంగా ప్రతి పౌరుడుకి విద్య అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాథమిక విద్యపై దృష్టి సారించిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఆలయాలతో సమానమని, మన అమ్మ, నాన్న అదే పాఠశాలలో చదివి గొప్ప స్థాయికి ఎదిగారని తెలిపారు. సగటు మనిషి జీవితాన్ని అమ్మా, నాన్నల కంటే అధికంగా ప్రభావం చేసే అవకాశం ఉపాధ్యాయుడికి దొరుకుతుందని అన్నారు. మంచి చదువుతోనే అందరికీ సమాన అవకాశాలు అందే దిశగా ప్రయాణం జరుగుతుందని, ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజానికి వెలుగునిచ్చేవారని, అసమానతలను తొలగించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు తమ కెరీర్ లో పిల్లల కోసం పని చేస్తున్నామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో రాబోయే 10 సంవత్సరాలు గడిపిన తర్వాత వారిలో ఎంత మందిని ప్రయోజకులు చేశారు, ఎంత మంది విద్యార్థులు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బాగు చేశారు, ఎంత మంది విద్యార్థులను దేశం గర్వించ దగ్గ పౌరులుగా తీర్చిదిద్దారు అనే దానిపైనే ఉపాధ్యాయుని విజయం దాగి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు మరింత బాధ్యత ఉంటుందని, బడుగు, బలహీన వర్గాల పిల్లలు అధికంగా మన పాఠశాలలో చదువుతారని, వీరిలో కసి పెంచి జీవితంలో పెద్ద స్థాయికి చేరేలా చూడాలని, పిల్లలు పెద్ద, పెద్ద ఆశయాలు పెట్టుకునేలా మన ఉపాధ్యాయులే నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమ పద్ధతిలో అవసరమైన మేర మౌళిక వసతులు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మనం వెళ్లే పాఠశాలలో ఆశించిన స్థాయిలో మౌళిక వసతులు, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి స్పందన రాకపోయినా నిరుత్సాహ పడకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. జీవితంలో భవనాలు కట్టడం, పెద్ద, పెద్ద వాహనాలు కొనడం, పదోన్నతులు సాధించడం విజయాలు కావని, మనం ఎంత మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశాం అనేది కీలకమని కలెక్టర్ వివరించారు. అమ్మాయి చదివితే తరతరాలుగా కుటుంబాలు బాగుపడతాయని, బాలికలను చదివిస్తే సమాజంలోనే మార్పు వస్తుందని ఈ అంశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. అమెరికా, కెనడా వంటి దేశాలు సైతం వైఫల్యం పొందిన చంద్రయాన్ ప్రాజెక్టులను ఇస్రో సైంటిస్టులు విజయవంతం చేశారని, అటువంటి సైంటిస్టులు అధికంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని అన్నారు. చంద్రయాన్ లో పని చేసిన శాస్త్రవేత్తల ఎదుగుదలకు కారణం ప్రభుత్వ ఉపాధ్యాయుడేనని, ఇది మీరంతా గుర్తుంచుకోవాలని అన్నారు. మన జిల్లాలో విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల హాజరు శాతంపై శ్రద్ధ పెట్టామని అన్నారు. విద్యార్థుల సామర్థ్యం ముందుగా పరీక్షించి దానినీ పెంచేందుకు దృష్టి సారించాలని అన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రతి పాఠ్యాంశం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన పద్ధతులు అలవర్చు కోవాలని, వారి జీవితంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేయాలని, చిన్న చిన్న నిరుత్సాహాలకు కృంగిపోవద్దని అన్నారు. రాబోయే సమాజానికి గట్టి పునాది వేసే బృహత్తర బాధ్యత మీపై ఉందని ఇది ఎప్పటికీ మరువవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఈవో సోమశేఖరశర్మ, మండల విద్యా శాఖ అధికారులు, నూతన ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
