అన్ని వర్గాలకు సమన్యాయం
రాష్ట్రానికి వరాల జల్లులు
— బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్
పయనించే సూర్యుడు న్యూస్ రాజంపేట ఫిబ్రవరి 01:
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్య తరగతి వారితో పాటు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేకూరేలా ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే పప్రధమమని బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వలన బడ్జెట్ రైతులు, పేద మధ్యతరగతి వారికి అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రూ 12 లక్షలు వరకు ఆదాయ పన్ను మినహాయించడం మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. రైతన్నలకు కిసాన్ క్రెడిట్ కార్డు రూ 3 లక్షలు నుంచి రూ 5 లక్షలు పెంపుదలతో రైతులు అప్పుల వీధిలో పడకుండా వారి కి మరింత పంట పెట్టుబడికి ఆసరాగా నిలబడుతుందని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ సాయం పెంపుదలతో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టి ఉపాధి లభించి వలసలు నియంత్రించి నిరుద్యోగితను రూపుమాపడం జరుగుతుందని వివరించారు. ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త పట్టణాలకు గ్రామాలను అనుసంధానించడంతో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. తద్వారా నిరుద్యోగిత శాతం కూడా తగ్గుతుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఆరోగ్య శాఖకు సైతం పెద్దపీట వేసిందని, 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు చేయడంతో పాటు ప్రతి జిల్లాలోనూ క్యాన్సర్ డే కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. ఔషధ మందులు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నదని, గత ఐదేళ్లలో అధోగతి పాలైన మౌలిక వసతుల పురోగతికి లక్ష 50 వేల కోట్లు కేటాయించడం ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇదొక సువర్ణ అవకాశమని, భారత్ నినాదంతో సాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు వరాల జల్లులు కురిపించారని పేర్కొన్నారు.