
సర్టిఫికెట్లు ఇప్పించండి సార్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నెల్లూరు పాలెం ప్రాంతానికి చెందిన కాటేపల్లి సురేంద్ర. పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత విద్య కోసం ఇంటర్మీడియట్ ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశాడు. ప్రస్తుతం డిగ్రీ విద్యాభ్యాసం నిమిత్తం పట్టణంలోని ఓ కళాశాలలో గత మూడు నెలల క్రితం చేరారు. అయితే ప్రస్తుతం ఆ డిగ్రీ కళాశాల యాజమాన్యం సురేంద్రకు సంబంధించిన టెన్త్ మరియు ఇంటర్ ధ్రువీకరణ పత్రాలు కళాశాలలో సమర్పించవలసిందిగా సూచించారు. ఆ మేరకు సురేంద్ర తాను ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేసిన కళాశాలకు వెళ్లి తన సర్టిఫికెట్స్ ఇవ్వవలసిందిగా ఆ ప్రిన్సిపాల్ ని కోరారు.
కళాశాల ప్రిన్సిపాల్ 20వేల రూపాయలు చెల్లించవలసిందిగా విద్యార్థి సురేంద్రకు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ తో మాట్లాడేందుకు విద్యార్థి సురేంద్ర తండ్రి సురేష్ సదరు కళాశాలకు వెళ్లి తనకున్న ఇబ్బందులు తెలియజేశారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ 10,000 కడితే మొత్తం సర్టిఫికెట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు విద్యార్థి సురేంద్ర 10 వేల రూపాయలు ప్రిన్సిపాల్ కి చెల్లించారు. సర్టిఫికెట్లలో ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్ని తమ వద్ద ఉంచుకొని మిగిలిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు. ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే మరో 10,000 చెల్లించాలని తెగేసి చెప్పారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ పై అసహనం వ్యక్తం చేసిన విద్యార్థి తండ్రి సురేష్ ఈ సర్టిఫికెట్స్ కూడా మీ వద్ద ఉంచుకోండి అని ప్రిన్సిపాల్ కి ఇచ్చి వెళ్లిపోయారు.
అయితే డిగ్రీ కళాశాల యాజమాన్యం ఒత్తిడి ఎక్కువ అవడంతో తిరిగి సర్టిఫికెట్ల కొరకు కొందరి నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. సోమవారం ఉదయం స్థానిక ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి ఫిర్యాదు రూపంలో ఇచ్చి తమ సర్టిఫికెట్ ఇప్పించవలసిందిగా కోరారు. ఆ సందర్భంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వారు స్పందించి కళాశాల యాజమాన్యం నుండి విద్యార్థి సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దారుకు సూచించారు. తాసిల్దారు స్పందించి వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి సర్టిఫికెట్స్ ఇవ్వవలసిందిగా సదరు ప్రిన్సిపాల్ కి సూచించారు. కళాశాలకు వెళ్లిన విద్యార్థి సురేంద్ర ఆయన తండ్రి సురేష్ కు ఆయన విస్తుబోయే షాక్ ఇచ్చారు.
మీరు ఇదివరకే సంతకాలు పెట్టి మొత్తం ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లిపోయారని ఇప్పుడు మా వద్ద అలాంటివేం లేవని చెప్పారు.దీనిపై సురేంద్ర తండ్రి సురేష్ స్పందిస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన కారణంగానే
కళాశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించి ఇలాంటి సమాధానమిస్తున్నారని పిల్లవాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఆందోళనగా ఉందని కన్నీరు మున్నీరుగా వినిపించారు.