*పయనించే సూర్యుడు. జనవరి 30.ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్
గుగులోత్ భావుసింగ్ నాయక్*
* అంగన్వాడీ కేంద్రాలు మరింత మెరుగ్గా నిర్వహించాలి…… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ
* గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని రెగ్యులర్ గా మానిటర్ చేయాలి
* ప్రీ స్కూల్ లో పిల్లలకు బోధన పకడ్బందీగా జరగాలి
* మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు.
గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పోషణ అభియాన్, ప్రీ స్కూల్ నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, లబ్ధిదారుల వివరాలు, అనీమియా నివారణ మొదలగు వివరాలను అదనపు కలెక్టర్ తెలుసుకొని ఖమ్మం అర్బన్, రూరల్, తిరుమలాయపాలెం, మధిర, కామేపల్లి, కల్లూరు, సత్తుపల్లి సిడిపిఓలు, సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సంక్షేమ శాఖ పరిధిలో తక్కువ పని తీరు ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంగన్వాడీ టీచర్ల హాజరు, పనితీరును రెగ్యులర్ గా మానిటర్ చేయాలని అన్నారు. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, గర్భిణీ మహిళలకు సంబంధించి ప్రతి అంశాన్ని ట్రాక్ చేసుకునేలా అంగన్వాడీ కేంద్రాల వద్ద వ్యవస్థ ఏర్పాటు చేయాలని, గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, చెక్ అప్ సకాలంలో జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రీ స్కూల్లో పిల్లల అటెండెన్స్ తగ్గకుండా చూసుకోవాలని, పిల్లల ఎదుగుదలను వంద శాతం మానిటరింగ్ చేయాలని, పోషణ లోపంతో బాధపడే పిల్లలను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ సరఫరా అయ్యే విధంగా చూడాలని, గుడ్లు, బాలామృతం ప్లస్ కు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
పోషణ లోపంతో ఎత్తు తక్కువ, బరువు తక్కువ గల పిల్లలను గుర్తించాలని, వారి కోసం నిర్దేశించిన సూపర్వైవైజ్డ్ సప్లిమెంట్ ఫీడింగ్ చేస్తూ, ఆ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సకాలంలో ఓపెన్ చేయాలని, న్యూట్రిషన్, పిల్లలకు సంబంధించి వాస్తవిక పరిస్థితులు రిపోర్ట్ చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో నూతనంగా మంజూరు చేసిన టాయిలెట్స్, ఇతర మౌళిక వసతుల కల్పన, మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, సీడీపీఓ లు, ఏసిడీపీఓలు, డిఎంసి డిహెచ్ఇడబ్ల్యు ఎస్డీ. సమ్రిన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.