
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ : భయాన్ని అధిగమిస్తూ కొత్త, కొత్త విషయాలను నేర్చుకుంటూ వ్యాపారాలను చేయాలి .వ్యాపారవేత్త ఆలోచనా ధోరణి మహిళలు అలవర్చుకోవాలి .వ్యాపార నైపుణ్య శిక్షణా శిబిరాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి గ్రామీణ మహిళా వ్యాపార వేత్తలు, సెర్ఫ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్థిక స్వతంత్రతతోనే మహిళా సాధికారత సాధ్యమవు తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రెండు రోజుల పాటు జిల్లాలోని 5 నియోజకవర్గాల గ్రామీణ మహిళా వ్యాపార వేత్తలు, సెర్ఫ్ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారాల నైపుణ్యాభివృద్ధిపై స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొదటి రోజు మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలకి సంబంధించి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక బలం, ఆర్థిక స్వతంత్రత ఉంటేనే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం వల్ల కుటుంబాలు బాగుపడతాయని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా ఎదిగేందుకు నమ్మకం ముందు తరాలకు వస్తుందని అన్నారు. వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు ధైర్యం ఉండాలని, ప్రారంభంలో మనకు వంద రకాల సందేహాలు, భయాలు ఉంటాయని వీటిని అధిగమిస్తూ కొత్త, కొత్త విషయాలను నేర్చుకుంటూ వ్యాపారాలను చేయాలని అన్నారు. వ్యాపారాలు ఒకే రోజు విజయవంతం కావని, వ్యాపారాలు నడపడంలో నేర్పు, ప్రణాళిక ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఏ వస్తువు అధికంగా వ్యాపారం అవుతుంది, ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిధిలో వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి, మన లాభం మార్జిన్ ఎంత ఉంటుంది వంటివి ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుందని అన్నారు. మన పరిసర ప్రాంతాలలో కస్టమర్ల ఆలోచనా సరళిని పరిశీలించి మన వ్యాపారాలు ఉండాలని అన్నారు. ఏ వస్తువుల విక్రయం వల్ల మనకు అధిక లాభం, వ్యాపారం అవుతుందో గమనించి జాగ్రత్తగా చేయాలని అన్నారు. మన దగ్గర ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేయాలి అనే ఆలోచన నిరంతరం ఉండాలని, మనకు సరిపోతుంది అనే ఆలోచన ఉండవద్దని అన్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించి గొప్ప స్థాయికి ఎదిగిన అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయని అన్నారు. జీవనోపాధి పెంపుదల, వ్యాపారాల నైపుణ్యాభివృద్ధికి అందించే శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు అవసరమైతే అదనపు శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప దేశాలలో మన భారతదేశం ఒకటని, ఇందులో మతాలు, కులాలకు అతీతంగా మహిళలు కొంతమేర వెనుకబడి ఉన్నారని, సమాజంలో 50 శాతం ఉన్న జానాభా వర్క్ ఫోర్స్ లో రాణించకపోతే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. మహిళలు సరైన అవకాశాలు లేక వెనకబడి ఉన్నారని, వారికి అవకాశాలు వస్తే అద్భుతంగా రాణించే క్షమత వారికి ఉందని అన్నారు. ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందినట్లు అవుతుందని, ధైర్యంగా ముందడుగు వేసి విజయవంతం కావాలని, మీ ధైర్యానికి, మీకు, మేము అండగా ఉంటూ, మీకు కావల్సిన సహకారం అందిస్తామని అన్నారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఏ.ఎల్.ఈ.ఏ.పి) స్కిల్ డెవలప్మెంట్ చైర్ పర్సన్ అన్నపూర్ణ మాట్లా డుతూ మహిళలకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకొని పైకి ఎదగాలని అన్నారు. తల్లిగా పిల్లలను ఎలా జాగ్రత్తగా పెంచుతారో, అదే రీతిలో మన వ్యాపారాలను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించి దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు దోహదపడాలని అన్నారు. మహిళలకు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ సహకారాలు అందిస్తామని అన్నారు.అనంతరం గ్రామీణ వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, అడిషనల్ డిఆర్డీవో నూరొద్దీన్, ఏ.ఎల్.ఈ.ఏ.పి. విజయవాడ రీజినల్ మేనేజర్ సునీత, ఐ.ఓ.ఎల్. ట్రైనర్ శివ నారాయణ, సి.హెచ్. రవీందర్, హైదరాబాద్ సేర్ప్ ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
