
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 16:-రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల పట్టణంలోని ఏరియా హాస్పిటల్ నందు జరిగిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో బాపట్ల జిల్లా డి సి హెచ్ ఎస్ డాక్టర్ శేషు కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వారికి ఆ గంట చాలా విలువైనదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు 40కె ఇంజక్షన్ అందుబాటులో ఉంచారని ఒక్కో ఇంజక్షన్ ఖరీదు సుమారు 45 వేల రూపాయలని తెలియజేశారు. ఎడమ దవడ వైపు నొప్పి, ఎడమ చేయి జాలుగా, ఛాతిలో నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం అని నిర్లక్ష్యం చేయకుండా ఏరియా హాస్పిటల్ నందు ఈసీజీ తదితర పరీక్షలు చేయించుకుని గుండెను భద్రంగా కాపాడుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ ను ఆవిష్కరించి రోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సిద్ధార్థ్, డాక్టర్ బాలసుధ, డాక్టర్ రత్నాంజలి, నర్సింగ్ సూపరిండెంట్ వరలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు.