
పయనించే సూర్యుడు. జనవరి 30. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
* ఫిబ్రవరి 12 లోపు నీటి వనరుల ఆక్రమణలు గుర్తించి నివేదిక అందించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
* మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి
* నీటి వనరుల ఆక్రమణ, భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఫిబ్రవరి 12 లోపు నీటి వనరుల ఆక్రమణలు గుర్తించి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నీటి వనరుల ఆక్రమణ, భూసేకరణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్థ్య లతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మున్నెరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతి 45 మీటర్లకు ఒక విభాగంగా పరిగణించి వాల్ నిర్మించడానికి ఒక బే యూనిట్ అంటారని, మొత్తం 17 కిలో మీటర్ల స్ట్రెచ్ లో 345 పైగా బే యూనిట్ లుగా నిర్మించాల్సి ఉంటుందని, వీటిలో 8.5 కిలో మీటర్ వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, మిగిలిన పట్టా భూమి సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.
మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ముందు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములలో పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. వాల్ నిర్మాణానికి అవసరమైన పట్టా భూముల సేకరణకు పట్టాదారు వారీగా మ్యాపింగ్ చేసి వివరాలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
పట్టాదారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ భూ సేకరణ వేగవంతంగా జరిగేలా చూడాలని, రాబోయే 15 రోజులలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. భూమి అప్పగించే కొద్ది భూ సార పరీక్షలు చేసి వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని, అవసరమైతే అదనపు బృందాలను రంగంలోకి దింపి పనులు యుద్ద ప్రాతిపదికన చేసి జూలై వరకు రెటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని నీటి వనరుల వద్ద ఆక్రమణకు గురైన భూముల వివరాలను రెవెన్యూ మ్యాప్, నీటిపారుదల మ్యాప్, టౌన్ ప్లానింగ్ రికార్డులను పరిశీలించి సమన్వయంతో గుర్తించి ఫిబ్రవరి 12 లోపు వివరాలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఇర్రిగేషన్ ఎస్ఇ వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.