- అంధాకారంలో రుద్రూర్ బస్టాండ్…
- వెలగని సెంట్రల్ లైట్లు..
రుద్రూర్, జనవరి 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు సరైన సౌకర్యాలు లేవని, సౌకర్యాలు కరువయ్యాయని ప్రయాణికులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. బస్సు కోసం వేచి చూసే ప్రయాణికులకు బస్టాండ్ ప్రాంగణంలో మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం లేవని దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా బస్టాండ్ ప్రాంగణంలో రాత్రి వేళల్లో సెంట్రల్ లైట్లు వెలగకపోవడంతో బస్టాండ్ ప్రాంగణం అంధాకారంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. అటు పోతంగల్, కోటగిరి, ఇటు వర్ని, బాన్సువాడ కు వెళ్లే ప్రయాణికులు రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు కోసం వేచి చూస్తారు. బస్టాండ్ ప్రాంగణంలో లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సెంట్రల్ లైట్లను ఏర్పాటు చేసి, బస్టాండ్ లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.