
గాలిపటాలు ఎగరేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
పయనించే సూర్యుడు తేదీ గాజులరామారం రిపోర్టర్: ఆడేపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా)… సంక్రాంతిని గ్రామాల్లోనే కాదు నగరంలోని కాలనీలో అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు మహిళలు ముగ్గులతో లోగిల్లను అందంగా తీర్చిదిద్దితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పతంగులు ఎగరవేస్తూ ఉత్సాహంగా గడుపుతుంటారు. భిన్న ఆకృతుల్లో తయారుచేసిన గాలిపటాలను ఎగరవేస్తూ కేరింతలు కొడుతుంటారు వాటిని ఎగురవేసే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కావున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చైనా మాంజా వినియోగించొద్దు. పతంగులకు మాంజా కట్టి ఎగురవేయడంతో అవి విద్యుత్ తీగలకు చుట్టుకొని సరఫరాలో అంతరాయం కలుగడమే కాకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చెట్లకు విద్యుత్తు తీగలకు చుట్టుకున్న మాంజాల కారణంగా పక్షులు మృతి చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2007లోనే అటవీశాఖ అధికారులు చైనా మాంజా వినియోగంపై నిషేధం విధించినప్పటికీ ఇంకా పలువురు వాటినే వినియోగిస్తున్నారు. పోలీసులు సంబంధిత దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా కొందరు చైనా మాంజా విక్రయాలు చేస్తున్నారు. ఈ మాంజా వినియోగంతో పక్షులు చనిపోతే మూడు నుండి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష లేదంటే రూపాయలు పదివేల జరిమానా విధించే అవకాశం ఉంది. కనీస జాగ్రత్తలు పాటిస్తూ సాధారణ దారంతోనే పతంగులు ఎగురవేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో జరిగిన కొన్ని సంఘటనలు. చింతల్ మల్లికార్జున నగర్ లో కొన్నేళ్ల క్రితం ఓ బాలుడు మేడమీద పతంగి ఎగరవేస్తుండగా అది దగ్గరలోని విద్యుత్ తీగలకు చుట్టుకుంది దాన్ని తీసుకునేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు వెంటనే ఆ బాలుడని ఆసుపత్రికి తీసుకెళ్లిన.. రెండు కాళ్లు ఒక చెయ్యిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మజ్ను నగర్ కు చెందిన మరో బాలుడు గతంలో తెగిన గాలిపటాన్ని అందుకోవడానికి పరుగు తీశాడు దారిలో విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్ట్ వైర్ కు తాకి విద్యుతాఘాతానికి గురయ్యాడు వైద్యులు రెండు చేతులు తొలగించారు.
ఉషోదయ కాలనీలోని ఓ బాలుడు మేడపై పతంగి ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. దేవమ్మ బస్సులోను ఓ బాలుడు విద్యుత్ అగాతానికి గురయ్యాడు.
ఇవి పాటించండి.
రహదారుల పక్కన గాలిపటాలు ఎగురవేయకూడదు. బహిరంగ ప్రదేశాలు మైదానాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
రక్షణ గోడలు ఉన్న భవనాలపై ఎగురవేయాలి.
ప్రమాదకరమైన చైనా మెటాలిక్ మాంజాలు వినియోగించొద్దు.
చెట్లకు విద్యుత్ తీగలకు చిక్కుకున్న గాలిపటాలను తీసుకోవడానికి ప్రయత్నించొద్దు.
కాటన్ నైలాన్ లెనిన్ తో తయారుచేసిన మాంజా వినియోగించడం శ్రేయస్కరం.
తెగిన గాలిపటాన్ని అందుకోవడానికి ప్రయత్నించొద్దు. పైకి చూస్తూ పతంగి కోసం పరిగెత్తడం వల్ల ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.