ఆర్జీయూకేటీ (బాసర, మహబూబ్‌నగర్) రెండో రోజు యూజీ అడ్మిషన్ల కోలాహలo
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) బాసర మరియు మహబూబ్‌నగర్ క్యాంపస్‌లకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సర ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సు ప్రవేశాల ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. తెలంగాణ నలుమూలల నుండి తరలివచ్చిన గ్రామీణ, పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో క్యాంపస్ సందడిగా మారింది. తొలుత సాక్ (ఎస్ ఏ సి) బిల్డింగ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయంలో సీటు సాధించినందుకు అభినందనలు తెలుపుతూ, పదో తరగతిలో చూపిన ప్రతిభను రాబోయే ఆరేళ్లలోనూ కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తల్లిదండ్రులకు, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ మాట్లాడుతూ, విద్యార్థులకు అత్యుత్తమ విద్యను, ఉజ్వల భవిష్యత్తును అందించడానికి విశ్వవిద్యాలయం అహర్నిశలూ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు తమ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని దిశా నిర్దేశం చేశారు.ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు సాక్ బిల్డింగ్ నుండి ఏబీ-1 (ఏబి-1) లోని అడ్మిషన్ కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ అధికారుల పర్యవేక్షణలో ధ్రువపత్రాల పరిశీలన అత్యంత పారదర్శకంగా జరిగి, ప్రవేశాలు విజయవంతంగా ఖరారయ్యాయి. బాసర, మహబూబ్‌నగర్ రెండు క్యాంపస్‌లకు కలిపి ఇక్కడే ఉమ్మడిగా కౌన్సిలింగ్ నిర్వహిస్తుండటం విశేషం. ఈ నెల 5, 6, 8 తేదీలలో జరిగే ఈ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో భాగంగా నేడు రెండో రోజు కౌన్సిలింగ్ సాగిందని విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో క్యాంపస్ అంతా విహరించారు. తరగతి గదులను, మెస్సులను, వాతావరణాన్ని చూసి ఆహ్లాదకరమైనటువంటి ల్యాండ్ స్కేప్, కాలుష్యరహితమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన పరిస్థితులను, విశ్వవిద్యాలయ మౌలిక వసతులు, ఇతర సదుపాయాలను చూసి అబ్బురపడ్డారు.క్యాంపస్ వాతావరణంపై హర్షాతిరేకాలు:గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇంతటి అంతర్జాతీయ స్థాయి వసతులు, ప్రశాంతమైన చదువుల వాతావరణం దక్కడం ఒక గొప్ప వరమని పలువురు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా డిజిటల్ తరగతి గదులు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు, విశాలమైన గ్రంథాలయంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఉన్న మెస్ సదుపాయాలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.”క్యాంపస్‌లోకి అడుగుపెట్టగానే చదువుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది. నగర కాలుష్యానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ఉన్నట్లున్న ఈ వాతావరణం మా చదువులకు ఎంతో అనుకూలం” అని సీటు సాధించిన ఒక విద్యార్థి ఆనందంతో పంచుకున్నారు”. “మరొక విద్యార్థి ఇదివరకే మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో సి.ఎస్సీ. సిటు సంపాదించినప్పటికీ ఆర్జీయుకేటి క్యాంపస్ విద్యావిధానానికి ఆకర్షితుడై ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నానని చెప్పాడు”.మొత్తంగా, ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో రెండో రోజు అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థుల నూతన ఆశలు, ఆకాంక్షల మధ్య అత్యంత విజయవంతంగా ముగిసింది. రాబోయే విద్యా సంవత్సరానికి ఈ క్యాంపస్ సరికొత్త విద్యా కుసుమాలను వికసింపజేయడానికి సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.